Site icon Swatantra Tv

కవిత నుంచి వివరాలు సేకరిస్తున్న ఈడీ అధికారులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఐదో రోజు ఈడీ ప్రశ్నించింది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర.. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఈడీ కస్టడీలో నాలుగో రోజూ కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేశ్‌, రోహిత్‌రావులను ఈడీ ప్రశ్నించింది. ఆమెను అరెస్టు చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్‌ చేసిన ఈడీ.. వాటిని వారి ముందే తెరిచి, వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దర్నీ సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు, ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. తన అరెస్టు అక్రమమంటూ కవిత ఈ నెల 18న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రేపు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈమేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్‌ చేసింది.

Exit mobile version