Site icon Swatantra Tv

విద్వేష రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో తీరు

    పశ్చిమ బెంగాల్లోని సందేశ్‌ ఖాలీ అంశం కొంతకాలం కిందట దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సందేశ్‌ఖాలీ లో మహిళలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అత్యాచారాలు చేశారని, లైంగిక వేధింపులకు పాల్ప డ్డారని ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల ను భారతీయ జనతా పార్టీ ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేసింది. ఒకదశలో షేక్ షాజహాన్ ఎపిసోడ్ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తాయని అందరూ భావిం చారు. ఇదిలా ఉంటే సందేశ్‌ఖాలీ అంశానికి సంబంధించి ఇటీవల కొత్త ట్విస్టు ఎంట్రీ ఇచ్చింది.

   ఇటీవల సందేశ్‌ఖాలీకి చెందిన ఓ మహిళ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఓ బాంబులాంటి వార్త పేల్చింది . వాస్తవానికి షేక్ షాజహాన్ ఎపిసోడ్‌లో సదరు మహిళ తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయడమే కాదు. షేక్ షాజహాన్‌పై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. ఇక సీన్ కట్ చేస్తే, తనపై అత్యాచారం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది. పీఏంఏవైలో పేరు చేరుస్తామంటూ నమ్మ బలికి బీజేపీ మహిళా మోర్చా నాయకులు తనతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని అసలు సంగతి వివరించింది. అంతేకాదు. ఆ తరువాత టీఎంసీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయించారని వెల్లడించింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటు న్నట్లు ఆమె పేర్కొంది. అంతేకాదు తాను ఎప్పుడూ రాత్రివేళల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు వెళ్లలేదన్నారు. తనను ఎవరూ లైంగికంగా వేధించలేదని ఆమె స్పష్టం చేసింది. చేసిన తప్పు తెలుసుకుని, తాను ఫిర్యాదును వాపసు తీసుకుంటున్నట్లు సదరు మహిళ వెల్లడించింది. కథ అక్కడితో ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో సదరు మహిళపై బీజేపీ కక్ష కట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నందుకు తనను బీజేపీ నేతలు బెదరిస్తున్నారని ఆమె ఆరోపించింది. బీజేపీ నాయకుల నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులను ఆమె కోరింది.

   సందేశ్‌ఖాలీ వ్యవహారంలో బీజేపీ కుట్ర చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ చాలా రోజుల నుంచి ఆరోపిస్తోంది. తమ ఆరోపణలకు మద్దతుగా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఓ స్టింగ్ ఆపరేషన్‌ నిర్వహించింది.అంతేకాదు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో సందేశ్‌ఖాలీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మరోవైపు సందేశ్‌ఖాలీ ఎపిసోడ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ వీడియో ఆధారంగా బీజేపీ నేత సువేంద, ఇతరులపై ఫిర్యాదుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్దమైంది. ఇదిలా ఉంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా తక్కువ తినలేదు. అసోం రాజధాని గౌహతిలో కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని హిమంత బిశ్వ శర్మ కొన్ని నెలల కిందట విషం చిమ్మారు. ఇక్కడ మియాలంటే వలస వచ్చిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు. గౌహతి నగర ఫుట్‌పాత్‌ల పై కూర్చుని బంగ్లాదేశ్ ముస్లింలు కూరగాయలను అధిక రేట్లకు అమ్ముతున్నారనేది హిమంత బిశ్వ శర్మ ఆరోపణ. అధిక ధరలకు కూరగాయలు అమ్మే ఎపిసోడ్‌కు తాను ఎండ్‌కార్డ్ వేస్తామన్నారు హిమంత బిశ్వ శర్మ. దీంతో అందరూ కూరగాయల ధరలు తగ్గించడానికి అసోం ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుందేమోనని అందరూ ఆశించారు. అయితే అలా జరగలేదు. నింగికి తాకిన కూరగాయల ధరలను నేలకు తీసుకురావడానికి ఫుట్‌పాత్‌లపై కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను అక్కడ్నుంచి వెళ్లగొడతామన్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిమంత బిశ్వ శర్మ చేయాల్సింది అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడం. అలా చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వాధినేతగా ఆయనకు ఉంది. అయితే ముఖ్యమంత్రి గా చేయాల్సిన పని చేయకుండా సమాజంలో హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా ద్వేషం పెంచే మాటలు మాట్లాడారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, హిమంత బిశ్వ శర్మతో ప్రారంభం కాలేదు. అలా అని ఆయనతో ముగియదు కూడా. గతంలో కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు సమాజంలో విషం చిమ్మే ప్రసంగాలు చేశారు. తమ మాటలతో సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఈ తరహా నాయకులు కనిపిస్తారు.

   2022 జూన్ నెలలో బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో ఒక టీవీ ఛానెల్ చర్చా గోష్టికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చలో భాగంగా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక సంఘ టనలు జరిగాయి. రాంచీలో జరిగిన అల్లర్లలో ఇద్దరు మరణించారు. నూపుర్ శర్మ కామెంట్స్ మనదేశం లోనే కాదు, అంతర్జాతీయంగానూ దుమారం రేపాయి. ముఖ్యంగా ఖతర్, మలేషి యా, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి అనేక ముస్లిం దేశాలు భారత్ ను వేలెత్తి చూపాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా గల్ఫ్ దేశాలతో స్వరం కలిపింది. దీంతో భారతదేశం వెంటనే అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నూపుర్ శర్మను సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది విషం చిమ్మే ప్రసంగాలు చేసే నాయకుల జాబితాలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. 2020 జనవరిలో ఢిల్లీలోని ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ముస్లిం మైనారిటీలపై ఆయన విషం చిమ్మారు. ముస్లింలను దేశ ద్రోహులంటూ ఘాటు ఆరోప ణలు చేశారు. దేశ్ కే గద్దారోంకో గోలీ మారో అంటూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత పర్వేష్ వర్మ కు కూడా ముస్లిం సమాజంపై విషం చిమ్ముతూ కామెంట్స్ చేసిన చరిత్ర ఉంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ …ముస్లింలపై ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. పర్వేష్‌ వర్మ కామెంట్లతో వాతావరణం మరింతగా హీటెక్కింది. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. మొత్తంమీద విద్వేష ప్రసంగాలు చేయడంలో రాజకీయ నాయకులు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు.

Exit mobile version