Site icon Swatantra Tv

అధికారంలోకి వచ్చామనే అలసత్వం వద్దు -చంద్రబాబు

అధికారంలోకి వచ్చాం కదా అనే అలసత్వాన్ని వీడాలంటూ నేతల సూచించారు సీఎం చంద్రబాబు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలని తెలిపారు. ప్రతీ రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలన్నారు.

ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటి పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ నేతలు ఎవరూ కూడా వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే… వారికీ మనకూ తేడా ఉండదు అని నేతలకు సూచించారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

గత 5 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను తనకు పంపాలంటూ ఆదేశించారు. టీడీపీ నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలని.. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని చంద్రబాబు తెలిపారు.

మరోవైపు.. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి 5విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా కూడా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నివేదికలు త్వరగా పంపాలని పార్టీ నేతలను ఆదేశించారు.

Exit mobile version