Site icon Swatantra Tv

ఎమ్మెల్యే తిప్పలకు ఓటమి భయం పట్టుకుందా?

గాజువాక. విశాఖ జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం చాలా కీలకం కావడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి.. అలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు తిప్పల నాగిరెడ్డి. మరి.. ఈ ఐదేళ్లలో ఆయన పనితీరు ఎలా ఉంది ? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు ?

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ…. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆశ్చర్యపోయేలా 2019లో గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు తిప్పల నాగిరెడ్డి. అందుకు ప్రధాన కారణం.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఆయన గెలవడమే. నాటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచినా.. తిప్పల నాగిరెడ్డి గెలుపు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తిప్పల నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కసారి పరిశీలిస్తే…2009లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు నాగిరెడ్డి. అయితే.. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయన.. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ, మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ కేండిడేట్ ల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి తప్పలేదు. ఇక, 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి తిప్పల నాగిరెడ్డి రంగంలో నిలిచారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బరిలోదిగారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. ఊహించని విధంగా తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. అది కూడా 16 వేలకు పైగా ఓట్ల తేడాతో కావడంతో అదో విశేషంగా నిలిచింది. అందరూ నాగిరెడ్డి గెలుపు గురించే మాట్లాడుకున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్లలో చాలా యాక్టివ్‌గా పనిచేశారు తిప్పల. నియోజకవర్గంలో రోడ్లు వేయడం, కాలువలు పక్కాగా నిర్మించడం, సామాజిక భవనాల నిర్మాణం చేపట్టి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అగనంపూడిలో వంద పడకల ఆస్పత్రి వచ్చేలా చూడ డంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని పలు వార్డుల్లో క్లీనిక్‌లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీటికితోడు ఫార్మాసిటీ కాలనీ పట్టా సమస్య, ఏపీఐఐసీ భూపట్టా సమస్య పరిష్కరించి, స్థానికులకు తోడ్పాటునందించారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. అయితే.. వయోభారం మీద పడడం, కోవిడ్‌ సంక్షోభం కారణంగా ఇంకా అనుకున్న స్థాయిలో పనులు జరగలేదని చెబుతున్నారు ఎమ్మెల్యే వర్గీ యులు. అయితే.. ప్లస్‌లు ఉన్నా.. మైనస్‌లు అంతకంటే ఎక్కువే ఉన్నాయన్న అభిప్రాయం నియోజ కవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయంతో ఒక్కసారిగా అంతా తిప్పల నాగిరెడ్డి గురించే మాట్లాడుకున్నారు. ఇక, తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నెరవేర్చని హామీల సంగతేంటి ?

గాజువాకలో రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుంది. అలాంటి చోట విజయం సాధించడం, పైగా పవన్ కల్యాణ్‌పై కావడంతో తమ సమస్యలు అన్నీ తీరుతాయని భావించారు. కానీ, వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి హయాంలో ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిన అంశం ఏదంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. కేంద్రం ఓ వైపు స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తుంటే ఎమ్మెల్యే ఏ మాత్రం అడ్డుకోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పించాయి. ఇక, గంగవరం పోర్ట్ విషయంలోనూ ఇదే మాదిరిగా జరిగిందన్న వాదన విన్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి నియోజకవర్గ ప్రజలకు పోర్ట్ విషయంలో ఎలాంటి లబ్ది చేకూర్చకుండా సొంత లాభం చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపైనే గంగవరం బాధితులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.. అవుతున్నారు. నియోజ కవర్గ ప్రజల్ని వేధిస్తున్న మరో సమస్య ట్రాఫిక్. పారిశ్రామిక వాడ కావడం, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో నిత్యం ఇక్కడి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే రోడ్డుపై నుంచే నిత్యం వీఐపీలు, వీవీఐపీలు వెళ్లినా ట్రాఫిక్‌లో చిక్కుకోక తప్పదన్న మాట విన్పిస్తుంటుంది. అయినా సరే.. ఇది పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

ఇవన్నీ ఒత ఎత్తైతే.. ఎమ్మెల్యే కుమారుల జోక్యం నియోజకవర్గంలో ఎక్కువైందన్న విమర్శలున్నాయి. పైగా ఏ పని జరగాలన్నా.. భవనాలు నిర్మించాలన్నా ఎంతో కొంత చదివించుకోవాల్సిందేనన్న ఆరోపణ లున్నాయి. వీరికి సంబంధించిన నాయకులు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. దీంతో.. అన్నీ ఆలోచించిన వైసీపీ హైకమాండ్‌ తిప్పలకు టికెట్ నిరాకరించింది. మొత్తంగా చూస్తే.. కొంచెం ఇష్టం.. ఎంతో కష్టం అన్నట్లుగా తిప్పల నాగిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు.. వందకు నలభై మార్కులు వేశారు. ఈసారి గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగకపోవడంతో కొత్త ఎమ్మెల్యే ఎవరవుతారు? తమ నియోజకవర్గంలో అభివృద్ధి సంగతేంటి అని ఎవరికి వారు చర్చించు కుంటున్నారు స్థానికులు.

Exit mobile version