Site icon Swatantra Tv

మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు

హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన షురూ అయింది. మూసీ సుందరీకరణలో మరో అడుగుపడింది. డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించిన రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్ల కూల్చివేత మొదలైంది. స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసిన వారి నివాసాలను తొలగిస్తున్నారు. వీరికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల తాళాలు అప్పగించాకనే.. మూసీలో ఖాళీ చేసిన ఇళ్లను పడగొడుతున్నారు. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్లడం లేదు.

నిన్న రెవెన్యూ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని నాంపల్లి, సైదాబాద్‌, హిమాయత్‌నగర్‌ మండలాల పరిధి శంకర్‌నగర్‌, వినాయక వీధిలో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. ఈ ప్రాంతాల్లో 333 నిర్మాణాలుండగా 300 ఇళ్లకు రివర్‌ బెడ్‌ మార్కింగ్‌ పెట్టారు. 83 ఇళ్లను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువగా రేకుల షెడ్లు ఉన్నాయి. ఇరుకు గల్లీల్లో ఉండడంతో ప్రొక్లెయిన్లు లేకుండా కూలీలను ఏర్పాటు చేసి నెమ్మదిగా పడగొడుతున్నారు. ఇంటి సామగ్రిని తీసుకెళ్లేందుకు నిర్వాసితులకు అవకాశం కల్పించారు. వస్తువుల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. నిర్వాసితులను మలక్‌పేట్‌లోని పిల్లి గుడిసెలు, ఉప్పల్‌లోని ప్రతాప్‌సింగారంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయానికి తరలిస్తున్నారు.

అయితే ఇళ్ల కూల్చివేతపై నిర్వాసితుల నుంచి కొంత సానుకూలత, మరికొంత వ్యతిరేకత వచ్చింది. శంకర్‌నగర్‌లో కొందరు నిరసన వ్యక్తం చేశారు. చిన్న డబుల్‌ బెడ్‌ రూంలలో పెద్ద కుటుంబాలు ఎలా ఉంటాయని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు సముదాయించారు. మూసీతో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలామంది ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు సంతోషంగా వెళ్తుండగా, 6 నుంచి 10 మంది ఉన్నవారు భావోద్వేగానికి గురవుతున్నారు.

Exit mobile version