Site icon Swatantra Tv

కొత్త ప్రభుత్వంలో తెలుగురాష్ట్రాల డిమాండ్లు

  నరేంద్ర మోడీ కొత్త క్యాబినెట్‌లో తెలుగురాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యం లభించింది. తెలంగాణకు రెండు మంత్రి పదవులు, ఆంధ్రప్రదేశ్‌కు మూడు మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ఇటీవలి కాలంలో కేంద్రంలో రెండు మంత్రి పదవులు రావడం ఇదే తొలిసారి. పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటివరకు ఒకే ఒక్కరికి మంత్రి పదవి లభించింది.

   బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ లకు కేంద్రమంత్రి వర్గంలో పదవులు లభించాయి. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ అధిష్ణానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇద్దరిని కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ మొదట్నుంచీ బీజేపీతో కొనసాగు తున్నవారే. కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచారు. కాగా బండి సంజయ్‌ కూడా కరీంనగర్ నుంచి రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీరిలో బండి సంజయ్ వెనుకబడిన తరగతుల నుంచి ఎదిగొ చ్చిన నేత కాగా కిషన్ రెడ్డి అగ్రవర్గానికి చెందిన వారు. బండి సంజయ్‌ అయితే కరీంనగర్‌ లో కార్పొరేటర్‌ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగొచ్చారు. అయితే కిషన్ రెడ్డి చదువుకునే రోజుల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో పనిచేశారు. అట్నుంచి బీజేపీలోకి వచ్చారు.

 ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర క్యాబినెట్‌లో చోటు దొరికిది. వీరిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత. రామ్మోహన్ నాయుడు లోక్‌సభకు ఎన్నిక కావడం ఇది మూడోసారి. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు కొత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పుట్టారు చంద్రశేఖర్. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తాజా ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర క్యాబినెట్‌లో చోటు లభించింది. శ్రీనివాస్ వర్మ మొదట్నుంచి భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. విధేయతకు పెద్ద పీట వేసి శ్రీనివాస వర్మకు మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. మూడు మంత్రి పదవులను ఉపయోగించి రాష్ట్రాభివృద్ధి కోసం ముగ్గురు మంత్రులు ఏం చేస్తార న్నది ఆసక్తిరేపుతోంది. కేంద్రమంత్రుల ద్వారా రాష్ట్రానికి ఏ స్థాయిలో నిధులు, విభజన హామీలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారన్నది ఆసక్తిరేపుతోంది.

   కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం, పదవులు దక్కడంతో, ఏపీలో విభజన హామీలు మరోసారి తెరపైకి వచ్చే అవకాశా లున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ప్రజలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున ప్రయోజనాలు దక్కుతాయి.పారిశ్రామికరంగం డెవలప్ అవుతుంది. పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఎత్తున రాయితీలు లభిస్తాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవు తుంది. ఈఈ విషయంలో కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న మంత్రులు ఎలాంటి వ్యూహం అవలంభించి రాష్ట్రానికి మేలు చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణం కూడా కీలకంగా మారింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ దాదాపుగా 20 నుంచి 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్రం పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు క్యాబినెట్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఏపీ నుంచి కేంద్రం లో మంత్రులుగా ఉన్న వారిపై ఉంది.

  ప్రస్తుతం ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరు స్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా నిధులు వస్తేనే, ఇప్పటివరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా అనేక విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యం లో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన విభజన హామీలను నెరవేర్చడంలో, నిధులు తేవడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ స్థాయిలో సఫలమవుతారన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే రాష్ట్రంలో పలు విభజన హామీలు చాలా వరకు నెరవేరలేదు. అలాంటి వాటిలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ, మైనింగ్ విశ్వవిద్యా లయం, ఏదైనా ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం, అసెంబ్లీ సీట్ల పెంపుదల.. ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఈసారైనా ప్రజల ఏళ్లనాటి కలలు మొత్తంగా చూస్తే.. ఏళ్ల తరబడి విభజన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలన్నీ ఐదుగురు కేంద్రమంత్రులపైనే ఉన్నాయని చెప్పక తప్పదు. 

Exit mobile version