Site icon Swatantra Tv

హాట్‌ హాట్‌గా ఢిల్లీ రాజకీయాలు.. నేడు రాజ్యసభకి ఢిల్లీ బిల్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ ఢిల్లీ రాజకీయాలు చాలా హాట్‌గా ఉన్నాయి. అందుకు అనేక అంశాలు కారణమవుతున్నాయి. వాటిలో ఒకటి ఢిల్లీ సర్వీసుల బిల్లు. ఈ బిల్లును ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ప్రవేశపెడతారని తెలిసింది. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తే.. ఢిల్లీ ప్రభుత్వంపై.. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం, అసెంబ్లీ కీలక నిర్ణయాలు తీసుకోలేవు. అందువల్లే ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గట్టిగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నాయి.

ఈ బిల్లును అధికారికంగా నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2023 అంటున్నారు. ఆమధ్య ఢిల్లీలో సర్వీసుల నియంత్రణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. దాంతో.. తీర్పు వచ్చిన కొన్ని రోజులకే కేంద్రం మే 19, 2023న ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దాని వల్ల ఢిల్లీ ప్రభుత్వానికీ, కేంద్రానికి కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది అని తెలిపింది. ఆ ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. దాన్ని బిల్లుగా ఆమోదించనివ్వకుండా చెయ్యాలని ప్రతిపక్షాల సపోర్ట్ కోరింది. అయినప్పటికీ లోక్‌సభలో బీజేపీ , NDA పక్షాలకే బలం ఉండటం వల్ల.. ఆ బిల్లు తేలిగ్గా ఆమోదం పొందింది.

రాజ్యసభలో ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉండగా… విపక్షాల బలం ఎక్కువగా ఉంది. అక్కడ బీజేపీకి 92 మంది సభ్యుల బలం ఉంది. వారిలో ఐదుగురు నామినేటెడ్ ఎంపీలున్నారు. NDA సభ్యులను కూడా కలిపితే.. ఆ కూటమి బలం 103కి చేరుతుంది. ఇక 9 మంది చొప్పున సభ్యులు ఉన్న వైసీపీ , బీజేడీ కూడా మద్దతు ఇస్తే.. ఈ సంఖ్య 121కి చేరుతుంది. అందువల్ల ఎలాగైనా బిల్లును పాస్ చేయించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అడ్డుకోవాలని కాంగ్రెస్ పక్ష కూటమి ప్రయత్నిస్తోంది.

Exit mobile version