తుంగభద్ర డ్యామ్ 19వ గేటు మరమ్మతు పనుల్లో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సాంకేతిక సమస్యలతో నిన్న స్టాప్ లాగ్ పనులు ముందుకు సాగలేదు. అతికష్టం మీద నిన్న పాతగేటు శిథిలాలను తొలగించింది టెక్నికల్ టీమ్. ఇవాళ మరోసారి తాత్కాలిక గేట్ బిగించే ప్రయత్నం చేస్తోంది నిపుణుల బృందం. మొత్తం ఐదు దశల్లో ఈ తాత్కాలిక గేటు అమర్చబోతోంది ఈ నిపుణుల బృందం.
ఇవాళ మొదటి గేటును అమర్చేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. డ్యామ్ లో నీళ్లు ఉండగానే గేటును అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోయి దాదాపు వారం రోజులు కావొస్తోంది. ఇప్పటి వరకు 40 టీఎంసీల నీరు కొట్టుకుపోయింది. ఒకవైపు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తుంటే.. మరోవైపు యుద్ధప్రాతిపదికన గేటును అమర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇంజినీర్లు.
తాత్కాలిక గేట్ విడిభాగాలను ఇప్పటికే డ్యామ్ పైకి చేర్చారు. నిన్న గేటు అమర్చేందుకు ప్రయత్నించగా.. సాంకేతిక సమస్యతో పనులు ఆగిపోయాయి. పాత గేటు శిథిలాలు అడ్డుపడడంతో పనులు ఆగిపోయాయి. దీంతో నిన్నంతా పాత గేటు శిథిలాలు తొలగించేందుకు టెక్నికల్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఇక గేటు విడిభాగాలను అమర్చేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తుండగా.. 80 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.
మొత్తం 7 విడిభాగాలను సిద్ధంగా ఉంచారు. ఒక్కో భాగం బరువు 15 టన్నులు కాగా.. ఒక్కోటి 4 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 29 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 40 టీఎంసీల నీటిని వదిలేశారు. ప్రస్తుతం 73 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి.