Site icon Swatantra Tv

శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ !

  మనదేశంలో దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చుతూ కాంగ్రెస్ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకు పడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిట్రోడా మాట్లాడుతూ తూర్పు భారతీయులు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. పిట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో హస్తం పార్టీని టార్గెట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు.

  శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. శరీర రంగు ఆధారంగా ఎవరి పట్ల అయినా వివక్ష చూపితే భారతదేశంలో ఎవరూ సహించబోరన్నారు. వ్యక్తిగతంగా తాను ఏమాత్రం సహించనని తెగేసి చెప్పారు. మనుషులను వివక్షతో చూడటం అనేది కాంగ్రెస్ రక్తంలోనే ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థినిగా తాము ప్రకటిస్తే శరీరరంగు కారణంగానే హస్తం పార్టీ వ్యతిరేకించిందని ఘాటు ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. శరీర రంగు నల్లగా ఉంటుందన్న కారణంతో ద్రౌపది ముర్మును ఆఫ్రికన్‌ అని కాంగ్రెస్ నాయకులు భావించి ఉంటారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

  వివక్షతో ఉన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీయుల్లాగా కనిపిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. దేశం ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిం చగలదా? దక్షిణాది ప్రజలను హస్తం పార్టీ ఆఫ్రికన్‌లలా చూస్తోంది. ఈ ధోరణిని దక్షిణాది ప్రజలు సహిస్తారా ? అంటూ ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోడీ. జాత్యాహంకారాన్ని ప్రతిబింబించే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తమిళ సంస్కృతి, గౌరవం గురించి గొప్పగా మాట్లాడే డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తమ బంధాన్ని తెంచుకునే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి దేశ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలను చాలా తెలివిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముడిపెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నించారు. వివక్షాపూరిత పిట్రోడా వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు.

శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. శామ్‌ పిట్రోడా తాజా వ్యాఖ్యలున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసి, ఆయనను జాత్యాహంకారి అంటూ ఆరోపించారు నిర్మలా సీతారామన్‌. దక్షిణాదికి చెందిన తాను ఎక్కడకు వెళ్లినా భారతీయురాలిగానే కనిపిస్తానన్నారు. తమ బృదంలో ఉన్న ఈశాన్య రాష్ట్ర నాయకులు కూడా అచ్చమైన భారతీయుల్లాగే ఉంటారన్నారు. అయితే రాహుల్ గాంధీ సలహాదారుడిగా ఉన్న శ్యామ్ పిట్రోడాకు మాత్రం తాము ఆఫ్రికన్లుగా, చైనీయులుగా, అరబ్బుదేశాల వాసులుగా కనిపిస్తున్నామన్నారు. శ్యామ్ పిట్రోడా కామెంట్స్, ఇండియా కూటమి ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ తీవ్రంగా స్పందించారు. శామ్ భాయ్‌ .నేను ఈశాన్య రాష్ట్రానికి చెందిన వాడినే అయినా, భారతీయుడిలానే ఉంటాను అంటూ వ్యాఖ్యానించారు.

ఇక శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు ప్రణీత. పోస్టుకింద ప్రణీత సుభాష్ తన ఫొటో పెట్టారు. అంతేకాదు ఫోటోకు ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. తాను భారతీయురాలిలా కనిపిస్తున్నానా ..? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు ప్రణీత సుభాష్.ఈ పోస్టుకు శామ్ పిట్రోడాను కూడా ప్రణీత సుభాష్ ట్యాగ్ చేశారు. హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈ ట్వీట్‌ పై నెటిజన్లు స్పందించారు. మనం అందరం భారతీయులమే కానీ శామ్ పిట్రోడాకు మాత్రం ఆఫ్రికావాళ్లలా కనిపిస్తున్నామంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి కొంతమంది నెటిజన్లు ప్రయత్నించారు. శామ్ పిట్రోడా యధాలాపంగా చేసిన కామెంట్స్‌ను బీజేపీ నాయకులు అవసరంగా రచ్చ చేస్తున్నారని ఎదురుదాడి చేశారు.ఈ సందర్బంగా, దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారు. అంటూ గతంలో బీజేపీ నేత తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. మొత్తంమీద శామ్ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి.

Exit mobile version