Site icon Swatantra Tv

అనంతపురం జిల్లాలో కౌంటింగ్‌ సర్వం సిద్ధం

    ఎన్నికల తుది పర్వంలో అత్యంత కీలక ఘట్టమైన కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను తేల్చే కౌంటింగ్‌ ప్రక్రియ కోసం అనంత జేఎన్‌టీయూలో కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించగా ఈవీఎంలను జేఎన్‌టీయూ భవన సముదా యంలోని స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లెక్కింపు వేర్వేరుగా జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే తరహాలోనే లోక్‌సభ స్థానానికి 14 టేబుళ్ల చొప్పున ఉండనున్నాయి. ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికి మాత్రమే 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 2 వేల 236 బూత్‌లు ఉన్నాయి. ఈమేరకు ఉరవకొండ 15 రౌండ్లకే తుది ఫలితం వెలువడనుంది. కళ్యాణదుర్గం 19 రౌండ్లు, గుంతకల్లు, తాడిపత్రి 20 రౌండ్లు, శింగనమల, అనంత అర్బన్, రాప్తాడు 21 రౌండ్లు, రాయదుర్గం 22 రౌండ్లకు లెక్కింపు పూర్తి కానుంది. రాయదుర్గం పరిధిలో మాత్రమే 296 బూత్‌లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ రౌండ్లు పట్టే వీలుంది.

ఇక జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మొత్తం 22 వేల 546 మంది ఓటేశారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి సంబంధించి 20 టేబుళ్ల ద్వారా మూడు రౌండ్లల్లో లెక్కిస్తారు. అదనపు ఏఆర్‌ఓలు 20 మంది, సూపర్‌వైజర్లు 20, సహాయకులు 40, సూక్ష్మ పరిశీలకులు 20 మంది లెక్కింపులో పాల్గొన నున్నారు. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 34 టేబుళ్లు ఉంటాయి. తాడిపత్రి పరిధిలో మాత్రమే ఆరు టేబుళ్లు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున ఉంటాయి. అనంతలో నాలుగు రౌండ్లు, రాప్తాడులో మూడు, తాడిపత్రి ఒక రౌండు, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం నియోజక వర్గాల్లో రెండ్రెండు రౌండ్లల్లో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇందుకు 170 మందిని సిబ్బందిని నియమించారు. ఇప్పటికే నిర్దేశిత సిబ్బంది నియామకం కూడా పూర్తి అయింది. ఇక కౌంటింగ్‌ సమయం లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా మూడంచెల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version