Site icon Swatantra Tv

ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఓ వైపు కాలుష్యంతో ఇబ్బందులుపడుతుండగా.. మరో వైపు భారీ మంచుదుప్పటి ఢిల్లీ నగరాన్ని కమ్మేసింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రోజురోజుకీ కాలుష్యం పెరుగుతుండడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 400 దాటింది. దాంతో జనం ఊపిరిపీల్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఛాతిలో మంట, కళ్లలో మంటగా ఉంటుందని ఢిల్లీ వాసులు వాపోతున్నారు. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ డేటా ప్రకారం.. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆనంద్‌ విహార్‌లో AQI 405గా రికార్డయ్యింది. ముండ్కాలో 413, బవానాలో 418, అశోక్ విహార్‌లో 414, జహంగీర్‌పురి 435, రోహిణి 407 రికార్డయ్యింది. నజాఫ్‌గఢ్ 366, ఆర్‌కేపురం 387, పంజాబీ బాగ్ 407, సోనియా విహార్ 394, ద్వారకా సెక్టార్-8 వద్ద 401 నమోదైంది.

మరోవైపు ఢిల్లీలో వాయువ్య దిశ నుంచి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కూడా గాలులు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దాంతో గాలి నాణ్యత మరింత పడిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

ఉత్తరభారతంలో రాబోయే ఐదురోజుల పాటు దట్టంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఎన్‌సీఆర్‌ పరిధిలో గాలి విషపూరితంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 50శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వంలోని 80 విభాగాలు, వివిధ ఏజెన్సీలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.40 లక్షలుగా ఉన్నది. గురుగ్రామ్‌, సోనిపట్‌, ఫరీదాబాద్‌తో పాటు ఎన్‌సీఆర్‌లోని పలు నగరాల్లో కాలుష్యం కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. అలాగే, గురుగ్రామ్‌లోని ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నది.

Exit mobile version