Site icon Swatantra Tv

లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం టీకాంగ్రెస్ నయా ఎత్తుగడలు

    పార్లమెంట్ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అందివచ్చిన అవకాశాలను అన్నింటినీ సద్వినియోగం చేసు కుంటోంది. ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకోవాలంటే.. పట్టింపులకు పోకుండా.. కొన్ని మెట్లు దిగాలి అన్న సూత్రాలను కాంగ్రెస్ పక్కగా అనుసరిస్తోంది. అధికారంలోకి వచ్చామ ని చేతులు దులుపుకోకుండా.. కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారం లో కూర్చోపెట్టేందుకు టీ కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తులో ఉన్న సీపీఐతోపాటు, పొత్తులో లేని సీపీఎంతోనూ చర్చలు జరిపి ఆ పార్టీల ఓట్లను కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

   అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవే యాలని భావిస్తోంది. టార్గెట్ 14గా ఎన్నికల కురుక్షేత్రంలో దిగిన కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే.. అసెంబ్లీ ఎన్నికలల్లో సీపీఎంతో మైత్రి కుదరకపో యినా, ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇతరులకు, వెళ్తే నష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి ఓటు గెలుపునకు కీలకమని భావిస్తోంది.

  సీపీఎం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే బాధ్యతను, కాంగ్రెస్ అధిష్ఠానం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించి, సంప్రదింపులకు పంపింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాదిరి.. బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి భట్టి కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు, అటు ఇండియా కూటమి లో భాగమైన సీపీఎం భువనగిరి లో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసినందున. భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. మరో వైపు భట్టి తో చర్చల సమయంలో సీపీఎం పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ సీపీఎం ఇండ్లు లేని నిరుపేదలకు వేసిన గుడిసెల విషయం, కార్మికుల కనీస వేతనం , పార్టీ బలోపేతం కోసం పలు పదవులతోపాటు ఇతర అంశాలు తీసుకువచ్చారు. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానంతోపాటు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

   2023 శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లిన సీపీఐకి కొత్తగూడెంను కేటాయించింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు ఒకటి, రెండు స్థానాలు కేటాయించాలని సీపీఐ నుంచి డిమాండ్ వచ్చినా, కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీట్ల కేటాయింపు లేకపోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సీపీఐని కోరింది. బీజేపీని రాష్ట్రంలో ఎదుగకుండా చేయాలనే భావనలో ఉన్న సీపీఐ కాంగ్రెస్ కి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పింది. గతంలో ఇచ్చిన రెండు ఎమ్మెల్సీల హామీని, పలు నామినేటెడ్ పదవులను, డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకువచ్చారు. మరో వైపు సీపీఎం కు భువనగిరి లో సపోర్ట్ చేస్తారా.. లేక కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారా అన్న దానికి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు కామ్రేడ్లు.

   సీఎం రేవంత్ కూడా అటు ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే నేతల మధ్య సమన్వయం కోసం.. సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేస్తున్నారు. భువనగిరి విషయంలో తన సన్నిహితుడికి టిక్కెట్ ఇప్పించుకున్న సీఎం. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉన్న వైరుధ్యాలను పక్కనబెట్టి , సమీక్షా సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించడం.. భువనగిరి లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొనేటట్లు చూడడం చేస్తూన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం.. నేతల మధ్య వర్గపోరు, అంతర్గత విభేదాలను పక్కనపెట్టిన కాంగ్రెస్ , అధిష్టానం సూచనలతో మరోపక్క సీపీఐ, సీపీఎంతో చర్చలు జరపడం, మద్దతు కోరడం చేసింది. మొత్తం మీద అన్ని వర్గాలను కలుపుకుని పోతూ.. విజయలక్ష్యం వైపు సాగుతోంది.

Exit mobile version