Site icon Swatantra Tv

లోక్‌సభ అభ్యర్థుల 8వ జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్‌

    లోక్ సభ ఎన్నిలకు సంబంధించి బరిలో దిగనున్న నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. తాజాగా 14మంది ఎంపీ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ నుంచి టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది.

   మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి పాల్గొన్నారు.

సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్‌ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సీట్లను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. వరంగల్‌ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, రాజేందర్‌ రావు, తీన్మార్‌ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవ కాశం ఉంది. ఇదిలాఉంటే 8వ జాబితాలో జార్ఖండ్ నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

Exit mobile version