Site icon Swatantra Tv

ట్రోలర్ల కట్టడి కోసం డీజీపీకి ‘మా’ ప్రతినిధుల ఫిర్యాదు

సోషల్ మీడియాలో సినిమా ఆర్టిస్టులపై జరిగే ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రోలర్లను కట్టడి చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నడుం బిగించింది. సామాజిక మాధ్యమాల్లో ఇలా ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై తెలంగాణ డీజీపి జితేందర్‌ని కలిసిన ‘మా’ ప్రతినిధులు ఫిర్యాదుని అందజేశారు. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని స్పెషల్ సెల్ దీని మీద ఫోకస్ చేస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ అండ్ టాలీవుడ్‌ సమన్వయం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రతి దానికి హద్దులు ఉంటాయని ట్రోలర్లను డీజీపీ హెచ్చరించారు.

అనంతరం మీడియాతో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి. కించపరిచేలా, భాధపెట్టేలా ఉండకూడదు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇక మీదట నటీనటులు మీద టోల్ చేస్తే సహించేది లేదు’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘సుమారు 200 యూట్యూబ్ చానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాము. ఆయన సానుకూలంగా స్పందించారు. దారుణమైన ట్రోల్స్‌కి పాల్పడే వారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాము. సైబర్ సెక్యూరిటీలోనే ఒక స్పెషల్ వింగ్ ట్రోలర్లపై నిఘా ఉంచుతుందని డీజీపీ తెలిపార’ని అన్నారు.

శివ కృష్ణ మాట్లాడుతూ.. ‘లేడీ ఆర్టిస్టులు ఈ ట్రోలింగ్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్ దిగజార్చేలా చేస్తున్నారు. కొంత మంది యు ట్యూబ్ చానెల్ డబ్బు సంపాదన కోసం ఇలా చేస్తున్నారు. పొలిటికల్ అండ్ సినిమా, జర్నలిస్టు ల మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు’ అని అన్నారు.

Exit mobile version