కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇవాళ కొత్తేమీ కాదు. పదవులు ఇవ్వకపోయినా, తమ కష్టాన్ని గుర్తించకపోయినా, సీనియర్లు పట్టించుకోకపోయినా.. ఇలా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం కామనే. పార్టీలో తాజా పరిణమాలపై ఫోకస్ చేసిన కొత్త తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. నేతలు, కార్యకర్తలను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సి రెడ్డిపై మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు కూడా చేశారు. అత్తాకోడళ్ల తీరుతో పార్టీ ఆగం అవుతుందని కంప్లైంట్ చేశారు. వారి ప్రవర్తన వల్ల పార్టీ కార్యకర్తలు దూరం అవుతున్నారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో ఈ ఇద్దరు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తమలాంటి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పారు.
వీరి అధ్వాన్నమైన నాయకత్వం వల్ల పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారుతోందని చెప్పారు. కొన్ని ఫిర్యాదులను ప్రస్తావించిన పాలకుర్తి నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు… వీరి వైఖరి, నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే.. నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఫిర్యాదు చేశారు.
ఇద్దరి తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే పార్టీ ఎప్పటికీ పాలకుర్తిలో కోలుకోదని కూడా అన్నారు. పార్టీ గెలుపు కోసం కృషిచేసిన తమలాంటి కిందిస్థాయి కార్యకర్తలకు గుర్తింపు లేదని.. తమ శ్రమ, అంకితభావాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.
పార్టీ మారి, పొగిడే వారి, డబ్బున్న వారికి మాత్రమే గుర్తింపు ఇస్తున్నారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని.. ఇప్పటివరకు కొత్త కమిటీలు కూడా వేయలేదని ఆరోపించారు. ప్రజల్లో యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయని ఆ నియోజకవర్గ పార్టీ మండల నాయకుడు .. మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశాడు.