Site icon Swatantra Tv

సీఎం టూర్‌ ఏర్పాట్లు

       తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు రెండు ప్రత్యేక హెలికాప్టర్‌ లల్లో భద్రాచలం చేరుకుంటారు.

     భద్రాచలానికి హెలికాప్టర్ ద్వారా చేసుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే దేవస్ధానం అధికారులు ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. రామాలయం అభివృద్దిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో ఆలయ అభివృద్ది పనులపై దేవస్ధానం అధికారులతో ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌ సమక్షంలో దేవస్ధానం అభివృద్దిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వను న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా “ఇందిరమ్మ ఇళ్ల” పధకానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అధికార యాత్రాంగం ఏర్పాట్లు చేసింది.

      ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగా మిధిలా స్టేడియంలో నిర్వహించాలని అధికారులు భావించినా… సాంకేతిక కారణాలతో వేదికను భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మార్చారు. అక్కడ ఏర్పాట్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే అదినారాయణ, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పోదేం వీరయ్య తదితరులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పధకం ప్రారంభం తరువాత భద్రాద్రి జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మణుగూరు సభలో పాల్గొంటారు. పినపాక

      నియోజకవర్గంలోని మణుగూరులో నిర్వహించే సీఎం రేవంత్‌ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న హెలిప్యాడ్‌ను యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. బహిరంగా సభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో రామాలయ అభివృద్ది కోసం ఏమి వరాలు ఇవ్వనున్నారో అని భద్రాద్రి వాసులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version