హైదరాబాద్‌లో సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రతి ఆరోపణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే..ప్రభుత్వం హైడ్రాను ఎందుకు తీసువచ్చింది.. హైడ్రా ఏం చేయబోతోంది అనే క్లారీటి ఇచ్చారు. మరోవైపు తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే తానే దగ్గరుండి క్యూల్చేయిస్తానని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. జన్వాడా ఫామ్‌హౌస్‌ను లీజ్‌కు తీసుకున్నానని కేటీఆర్ అంటున్నారని.. ఆ లీజు విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఒక వేళ అఫిడవిట్‌లో చూపించకపోతే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి కట్టిన ఫామ్‌హౌస్‌ను కేటీఆర్ ఎందుకు లీజుకు తీసుకున్నారని నిలదీశారు. చెరువులను ఆక్రమిస్తే ఎంతటి వారైనా సరే కూల్చేస్తామని చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. ఆధారాలు చూపిస్తే తానే దగ్గరుండి క్యూల్చేయిస్తానని తెలిపారు.
మరోవైపు హైడ్రాతో ఎవరినో భయపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం మాదిరి.. స్వార్థం కోసం కూల్చివేతలు చేపట్టలేదని చెప్పారు. హైడ్రా తమ పార్టీ నేతల భవనాలను సైతం కూల్చివేసిందని.. చెరువులో నిర్మాణాలు చేస్తే బిఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఎవరు ఉన్నా సరే కూల్చేస్తామని తేల్చి చెప్పారు. నగరంలో చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమీటి వేసేందుకు సిద్ధమని.. దీనికి హరీష్ నేతృత్వం వహించినా ఆహ్వానిస్తామన్నారు.
ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చందన్నారు సీఎం రేవంత్. సిసోడియా, కేజ్రవాల్‌కు రానీ బెయిల్ ఐదు నెలల్లో కవితకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై మాట్లాడుతున్న బిఆర్ఎస్‌కు..పదేళ్లు తెలంగాణ తల్లి ఎందుకు గుర్తు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రుణమాఫీ కానీ వారి లెక్కలు సేకరించి కలెక్టర్‌కు ఇవ్వాలని.. ఇలా చేస్తే చేసిన పాపం కొంతైనా పోతుందని సెటైర్ వేశారు. కేసీఆర్ సర్కార్ 2018-24 లో 13,329 కోట్లు రుణమాఫీ చేస్తే..తాము కేవలం 27 రోజుల్లో 18 వేలకోట్లు రుణమాఫీ చేసామని గుర్తు చేశారు. మొత్తానికి.. రుణమాఫీ, హైడ్రా, తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుపై బిఆర్ఎస్ చేస్తున్న ఆరోఫణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ నేతలను డిఫెన్స్‌లోకి నెట్టేలా టార్గెట్ చేశారు సీఎం రేవంత్.