Site icon Swatantra Tv

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

దక్షిణ కొరియాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియాకు చేరుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.

కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ చర్చలు జరిపారు. కొరియా టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కియాక్‌ సంగ్‌, వైస్‌చైర్మన్‌ సొయాంగ్‌ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్‌టైల్‌ కంపెనీల అధినేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. హన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్‌తో సీఎం రేవంత్‌ బృందం భేటీ కానుంది. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫ్యూచర్ హంగంగ్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్‌కు రేవంత్ టీమ్ నేడు వెళ్లనుంది.

శామ్‌సంగ్ ప్రతినిధులతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ లీడర్‌షిప్‌తో చర్చలు నిర్వహింనున్నారు. అలాగే శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో భేటీ కానున్నారు. కాల్‌టెక్స్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ టీం పెట్టుబడులపై చర్చలు నిర్వహించనుంది. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ టీం సందర్శించనుంది. హన్ రివర్ ఫ్రంట్, హన్ రివర్ పార్క్ ఫీల్డ్ విజిట్ చేయనుంది.

మరోవైపు దిగ్గజ ఆటోమోటివ్‌ కంపెనీ హ్యుందయ్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మెగా టెస్టింగ్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేయనుంది. భారత్‌లోని హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ద్వారా ఒక మెగా టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ రాత్రికి రేవంత్ బృందం హైదరాబాద్‌కు పయనం కానుంది.

Exit mobile version