Site icon Swatantra Tv

తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత తగ్గిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు వైసీపీ నేతలు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారని తెలిపారు. నెయ్యికి బదులు యానమిల్‌ ఫ్యాట్ వాడినట్టు తెలిసిందన్నారు. NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛ మైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. గత ప్రభుత్వ నిర్వాకం తెలిసి భయపడ్డానని అన్నారు చంద్రబాబు. గత పాలకులు అన్నదానం విషయంలో నిర్లక్ష్యం వహించారని.. ప్రసాదం నాణ్యత కూడా దెబ్బతీశారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న ప్రసాదం నాణ్యతను పాటిస్తున్నామని.. నాణ్యత ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు చంద్రబాబు. నిత్యం తిరుమలలో మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా జారీ చేస్తోంది టీటీడీ. లడ్డూ పవిత్రను ఇంకా కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అన్న ప్రసాదాల తయారీలోనూ నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నామని ప్రకటించింది సర్కార్‌. గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్‌ రెడ్డి కమిటీ. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు అధికారులు.

చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను , వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని అన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని చెప్పారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరని.. ఇలాంటి ఆరోపణలు చేయరని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకడారని మరోమారు నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను.. తన కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా.. అంటూ సవాల్ విసిరారు.

ఇక టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు. దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలు దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీని వాడుకోవడం సరికాదన్నారు. తిరుమలలో అన్నప్రసాదాల విషయంలో అధికారుల ప్రమేయం ఉండదన్నారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు పబ్బం గడపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే సుబ్బారెడ్డి గారు.. మనిషి పుట్టుక పుట్టిన వాళ్లు ఎవరూ అలాంటి పనులు చేయరని అన్నారు. కానీ మీరు చేశారు అనేదే సీఎం గారి ఆవేదన, బాధ అంటూ కౌంటరిచ్చారు. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్దికోసం ఎలా వాడుకున్నారో…. భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో…. కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మరిచిపోలేదని అన్నారు.

Exit mobile version