ఏపీలో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. 5 హెలీకాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. హెలికాప్టర్లు, పడవులు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం 6 గంటల నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని వివరించారు. 5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్దం చేసి పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా 100 శాతం ఆహారం పంపిణీ జరగాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు . NDRF బృందాలు చేరుకోలేని చోటకు హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని సూచించారు. మూడు పూటలా ఆహారం అందించాలని.. 36 డివిజన్లలో ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆహారం అందిందీ లేనిదీ నిర్థారించుకోవాలన్నారు చంద్రబాబు. రెండు రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేక పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని చెప్పారు. మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని సూచించారాయన. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుధ్య పనులకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.