Site icon Swatantra Tv

విత్తనాల షాపులపై అధికారుల తనిఖీలు

ఖరీఫ్‌ పంటకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కాస్త ముందుగానే వరుణుడు చినుకులు కురిపించడంతో విత్తనాలకు పరుగెడుతున్నారు రైతులు. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలతో రైతులను నిండా ముంచేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకావడంతో ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆగం చేస్తున్నారు వ్యాపారస్తులు. వరంగల్‌ జిల్లాలో అక్కడక్కడ చినుకులు పడటంతో విత్తనాలు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు రైతులు. సీడ్స్‌ కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరారు. సీడ్స్‌ డిమాండ్‌ను గమనించిన వ్యాపారస్తులు.. ఇదే అదునుగా బ్లాక్‌లో అమ్ముతూ, ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకునే పనిలిలో పడ్డారు. దీంతో రైతు సంఘాలు ఆగ్రహం వక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించడంతో వరంగల్‌ జిల్లాలో సీడ్‌ షాపులపై కొరడా ఝుళిపిస్తున్నారు.

అన్నదాతలను ఆగం చేస్తున్న వ్యాపారస్తుల పని పట్టేందుకు రంగంలోకి దిగారు జాయింట్‌ డైరెక్టర్‌ ఉషా దయాల్‌. డీలర్ల వద్దకొచ్చిన సీడ్‌ ఎంత..? ఆ స్టాక్ ఏ షాపులకు ఎంత విక్రయించారు..?ఆ షాపులలో ఆ స్టాక్ ఉందా, అమ్మేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్కెట్లో అధికంగా అమ్ముడు పోయే మూడు రకాల పత్తి విత్తనాలను గుర్తించిన అధికారులు.. ఆ విత్తనాలు ఏ షాపులో ఎంత స్టాక్ ఉంది.? రైతులకు ఎంఆర్‌పీ రేటుకే ఇస్తున్నారా, అధిక ధరతో విక్రయిస్తున్నారా అని స్టాక్ బుక్‌లు చెక్‌ చేశారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే, రైతుకు అవసరం లేకపోయినా వేరే విత్తనాలను అంటడగడుతున్నారు వ్యాపారస్తులు. రైతు డిమాండ్ చేసిన సీడ్‌ ఇవ్వాలంటే, తాము చెప్పినట్టు వేరే విత్తనాలు కూడా కొనసాల్సిందేనని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. మరికొందరు సీడ్‌ రేటు ఒక ధర ఉంటే, దాని కంటే అధిక రేటుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక రైతులు డిమాండ్ చేస్తున్న మూడు రకాల పత్తి విత్తనాల ధరలు స్టాక్‌ బోర్డులో ఎక్కడా ఉండటం లేదు. దీంతో దుకాణదారుడు ఎంత చెబితే అంత రేటుతో కొనాల్సివస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో వ్యాపారస్తులు బ్లాక్‌ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఒక్క రూపాయి కూడా అధిక ధరకు అమ్మేది లేదని.. అలా కాదని రైతులను ముంచితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా వ్యాపారస్తులు తమ బుద్ధిని మార్చుకుం టారా..? లేదంటే అధికారుల మాటను పెడచెవిన పెట్టి తమ దందా తాము నడిపించుకుంటారా చూడాలి మరి.

Exit mobile version