Site icon Swatantra Tv

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం

        దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చింది. CAA అమలు తర్వాత, 31 డిసెంబర్ 2014కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందు వులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఐదేళ్లపాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందుతారు. ఆరు కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది.

     అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించినకాల పరిమితిని దాటి దేశంలో కొన సా గే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం.. అక్రమ వలస దారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు – హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవు లకు మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు.

      CAA డిసెంబర్ 2019లో ఆమోదించబడింది. తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం. అయితే, ఇందులో ముస్లింలను చేర్చలేదు. ఇది వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతి పక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘి స్తోందని కొందరు ఆరోపించారు. తాజాగా.. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని టీఎంసీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు న్నాయి. ప్రజల పట్ల వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ముస్లింలు మెజారిటీగా ఉండగా, హిందువులు, ఇతర కులాలు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు .. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిసెంబర్ 2019లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది.

    దేశ ప్రజలందరూ మత సామరస్యంతో జీవిస్తున్న వాతావరణంలో.. విభజన రాజకీయాల స్ఫూర్తితో అమలు చేస్తున్న భారత పౌరసత్వ సవరణ చట్టం-2019 ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఏఏపై తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ అన్నారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పాలకులు హామీ ఇవ్వాలని విజయ్ పేర్కొన్నారు. సీఏఏ అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం కోసం నిబంధనలను నోటిఫై చేయడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నంలో ప్రధాని మోదీ మునిగిపోతున్న తన నౌకను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ అన్నారు. వారికి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతా రని ఎక్స్ ఖాతాలో స్టాలిన్ పేర్కొన్నారు.

      సీఏఏపై మా అభ్యంతరాలు అలాగే ఉన్నాయని, ముస్లింలే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు. సీఏఏ అనేది విభజన వాదం, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకునే గాడ్సే ఆలోచనపై ఆధారపడిందన్నారు. హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ, మతం లేదా జాతీయతపై పౌరసత్వం ఆధారపడి ఉండకూడద న్నారు. ఐదేళ్లుగా ఈ నిబంధనలను ఎందుకు పెండింగ్‌లో ఉంచారు, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తు న్నారో ప్రభుత్వం వివరించాలన్నారు. ఎన్‌పీఆర్-ఎన్ఆర్‌సీతోపాటు, సీఏఏ ముస్లింలను లక్ష్యంగా చేసుకో వడానికి ఉద్దేశించిందన్నారు. సీఏఏ ఎన్‌పీఆర్ ఎన్ఆర్‌సీలని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయు లకు దీన్ని మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదంటూ ట్వీట్‌ చేశారు.ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్‌లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

Exit mobile version