Site icon Swatantra Tv

ముగిసిన సీబీఐ కస్టడీ ….కవితను కలిసిన కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను మూడు రోజుల పాటు విచారించారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సీబీఐ చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు అప్పచెప్పారని సీబీఐ అభియోగం మోపింది.

సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్‌ చాట్స్‌పై కవితను సీబీఐ ప్రశ్నించింది. కవిత విచారణను సీబిఐ వీడియో రికార్డు చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్‌ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఇతర ఆప్‌ నేతలు, హైదరా బాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్‌ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. 100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను వాదనల సందర్భంగా సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా సీబీఐ కవితను ప్రశ్నించింది.ఇదిలా ఉంటే సీబీఐ కస్టడీలో ఉన్న కవితను సోదరుడు కేటీఆర్‌ కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో నిన్న కవితను సోదరుడు కేటీఆర్ కలిశారు.

Exit mobile version