Site icon Swatantra Tv

తెలంగాణ గడ్డపై రాజుకున్న కుల రాజకీయం

   తెలంగాణలో మాదిగల పోరు ఉదృతమవుతోంది. టికెట్‌ ఇస్తారా లేదంటే, మా తడాఖా ఏంటో చూస్తారా అంటూ అధికార పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు. ఎలక్షన్‌ బరిలో దిగేందుకు తామెందులో తక్కువ అని నిలదీస్తున్నారు. పక్క పార్టీ నేతలే కాదు. సొంత గూటి లీడర్లే నిరసన గళం వినిపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల వేళ హస్తం హైకమాండ్‌కు మాదిగల మ్యాటర్‌ తలనొప్పిగా మారింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు నేతలంతా ముక్త కంఠంతో ఎదిరిస్తూ దీక్షలు, ఆందోళన లంటూ ఉద్యమ బాట పట్టడంతో బుజ్జగింపు చర్యలకు దిగింది అధిష్టానం.

      తెలంగాణ కాంగ్రెస్‌లో మాదిగల వ్యవహారం కల్లోలం రేపుతోంది. రిజర్వ్‌డ్‌ స్థానాలను తమకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు మాదిగలు. మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నా, ఒక్క టికెట్ కూడా వారికి కేటాయించక పోవడంతో మాదిగలు నిరసన గళం వినిపిస్తున్నారు. టికెట్‌ కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరగుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దే మాలకావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతోందని సొంత గూటి నేతలే ఆరోపిస్తుండటంతో ఈ వార్‌ మరింత ముదురుతోంది.

       తెలంగాణలోని ఎస్సీ సామాజిక వర్గంలో 70 శాతం మాదిగలే ఉన్నారు. అయితే,..రాష్ట్రంలో మూడు పార్లమెంట్ సీట్లు ఎస్సీలకు రిజర్వు చేయగా, మూడు స్థానాల్లోనూ ఒక్కస్థానానికైనా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంతో మాదిగలు అగ్గిమీద గుగ్గిలంలా మండిపోతున్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లురవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్‌ ప్రకటించింది అధిష్టానం. దీంతో తమకు జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజాసంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాటపట్టారు. ఇక ఈ పరిణామాల వల్లే మాదిగ నేత మందా జగన్నాథం హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

       ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీ మాదిగలకు ప్రాధాన్యతనిచ్చింది. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకుగాను, ఇద్దరు మాదిగలకు, మాల ఉపకులమైన ఒక నేతకాని వర్గానికి టికెట్లు కేటాయించింది. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్‌ను ఎంపిక చేసింది. అలాగే వరంగల్ పార్లమెంట్ నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పెద్దపల్లి అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా మాదిగలకు టికెట్‌ కేటాయించి వారిపై అభిమానాన్ని చాటింది. మూడు స్థానాల్లో ఇద్దరు మాదిగ, ఒకరు మాల సామాజికవర్గం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసింది. బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్యకు మొదట పార్టీ టికెట్ కేటాయించినా, ఆమె పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో… మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశమిచ్చారు. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టికెట్‌ ఇచ్చింది.

అయితే, కాంగ్రెస్‌ మాత్రం మాదిగలను పక్కనపెట్టింది. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు రెండు సీట్లను మాలలకు కేటాయించగా మూడో స్థానం మాదిగ ఉప కులమైన బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయిం చింది. నాగర్ కర్నూల్ స్థానం నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లి నుంచి మాల సామాజికవ ర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంఓ ఓట్ల శాతంలో అధికంగా ఉన్నా, జనాభా ప్రాతి పదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించక పోవడంపై ఆ పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేఫథ్యం లోనే మాదిగ జాతికి అన్యాయం చేశారని మాజీ మంత్రి మోతుకుపల్లి నర్సిములు ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వనందుకు బాధగా లేదని.. తన జాతికి అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలు పార్లమెంట్‌కి వెళ్లొద్దా అని నిలదీశారు. దళిత జాతికి జరిగిన అవమానం సరి చేసుకోక పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తానన్న ఆయన రెండు ఎంపీ సీట్లు కేటాయించాల్సిం దేనని డిమాండ్‌ చేస్తూ లీలానగర్‌లోని తన నివాసంలో దీక్షబూనారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్‌ తీరుపై ధ్వజమెత్తారు. మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన ఆయన..ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులను తరిమికొట్టాలని.. రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి వ్యతిరేకంగా 10 రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

   మరోవైపు తమపై నిప్పులు చెరుగుతున్న మాదిగలను బుజ్జగించే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. తాము మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, ఊట్ల వరప్రసాద్‌తో సీఎం సమావేశమ య్యారు. రాజ్యసభ, శాసనమండలితోపాటు నామినేటెడ్ పోస్టుల్లో మాదిగలకు అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మరి మాదిగలు ఆరోపిస్తు న్నట్టు ఖర్గే అధ్యక్షతన వారికి అన్యాయం జరుగుతోందా..? మాలలకే పెద్ద పీట వేస్తున్నారా..? సీఎం రేవంత్ బుజ్జగింపులకు మాదిగలు తలొగ్గుతారా..? లేదంటే తమ ప్రణాళిక ప్రకారం పోరును ఉదృతం చేస్తారా..? అదే జరిగితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి..? పార్టీపై ఏమేర ప్రభావం చూపే అవకాశముందన్నది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Exit mobile version