Site icon Swatantra Tv

పొత్తులతో కాంగ్రెస్ కు విజయం దక్కేనా ?

    మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు రాజకీయంగా ప్రత్యేకత లు కలిగి ఉంటాయి. కాగా ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడుకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకత లున్నాయి. దేశంలో ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో 207 నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో హస్తం పార్టీ కేవలం 52 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తోంది.

    మనదేశంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో లోక్‌సభ నియోజకవర్గాలున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా ఉత్తరప్రదేశ్‌ను రాజకీయ పండితులు భావిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కేంద్రంలోనూ అదే పార్టీ పవర్‌లోకి వస్తుందన్నది రాజకీయ వర్గాల నమ్మకం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలంగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ ఉంది. ఇటీవల అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో సామాన్య ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ మరింగా పెరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల చిరకాల కల. చివరకు నరేంద్ర మోడీ హయాంలో ఐదు శతాబ్దాల కల సాకారమైంది. ప్రస్తుతం రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పాటు సుహేల్‌దేవ్‌ నాయకత్వంలోని భారతీయ సమాజ్‌ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 80 సీట్లలో విజయదుందుభి మోగిస్తామంటున్నారు కమలనా థులు.

   బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయడానికి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. పొత్తులో భాగంగా కాంగ్రెస పార్టీ ఈసారి 17 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మిగతా 63 నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమి లోని ఇతర భాగస్వామ్య పక్షాలు బరిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ తరువాత ఎక్కవ లోక్‌సభ నియోజకవర్గా లున్న రాష్ట్రం మహారాష్ట్రే. ఇక్కడ 48 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తో హస్తం పార్టీ జట్టు కట్టింది. ఈ శిబిరం పేరే మహా వికాస్ అఘాడీ. శివసేన చీలిపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ప్రజల్లో సానుభూతి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలాగే శరద్ పవార్‌కు ప్రజల్లో ఉన్న పరపతిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మహారాష్ట్రలో కీలకమైన నియోజకవర్గాల్లో బారామతి ఒకటి. బారామతితో పాటు చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలలో శరద్ పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. అటు ఉద్ధవ్ థాక్రే పరపతి, ఇటు శరద్ పవార్ పలుకుబడి మీద ఆధారపడి మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ భావిస్తోంది.

  నలభై లోక్‌సభ నియోజకవర్గాలున్న బీహార్‌ ఎప్పుడూ రాజకీయంగా వార్తల్లో ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన జేడీ యూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల శిబిరం మార్చారు. ఇండియా కూటమికి గుడ్‌బై కొట్టి మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. మహాఘట్‌ బంధన్‌గా పేరున్న ఈ కూటమిలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ తోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి. ఇక దక్షిణాది న గల తమిళనాడుపై ఈసారి కాంగ్రెస్ పార్టీ బోలెడు ఆశలు పెట్టుకుంది.తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అంతేకాదు తమిళనాడులో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం గా ఉన్న డీఎంకేనే అధికారంలో ఉంది. పొత్తులో భాగంగా ఈసారి డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నియోజకవర్గాల నుంచి బరిలో ఉంది. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు మిగతా సీట్లు కేటాయించారు.

  తమిళనాడులో కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే రెండూ ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నాయి. దీంతో చిన్నచిన్న పార్టీలను కలుపుకుని బరిలో నిలిచింది కమలం పార్టీ. అంతేకాదు అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం వర్గం విడిగా పోటీ చేస్తోంది. దీంతో డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అంతిమంగా డీఎంకే – కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరుగుతుందని లెక్కలు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా గుజరాత్ అలాగే హర్యానాల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుంది. అయితే పంజాబ్‌లో మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీతో హస్తం పార్టీ తలపడుతోంది. ఇదో విశేషం. అలాగే బెంగాల్‌, రాజస్థాన్‌ లలో లెఫ్ట్ పార్టీలతో హస్తం పార్టీ జట్టు కట్టింది. బెంగాల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్ తో హస్తం పార్టీకి పొత్తు లేకపోవడం ఒక విశేషం. ఇదిలా ఉంటే కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌తో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ హోరాహోరీగా తలపడుతోంది.

Exit mobile version