Site icon Swatantra Tv

కేసీఆర్‌, హరీశ్‌ రావు గొడవ పడ్డారంటూ ప్రచారం.. సైబర్‌ పోలీసులకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓడిపోవడంతో .. అప్పటి నుంచి కేసీఆర్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌, హరీశ్‌ రావు మధ్య గొడవలు, సీఎం సీటు కోసం వీరిద్దరి మధ్య యుద్ధం… . ఇలాంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తాజాగా కేసీఆర్‌, హరీశ్‌ రావు గొడవ పడ్డారంటూ ఓ సోషల్‌ మీడియా వేదికలో పోస్ట్‌ చేయడం.. బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. బీఆర్‌ఎస్‌ పార్టీపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ బృందం సభ్యులు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని కట్టుకొని మరీ బీఆర్‌ఎస్‌ పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తోందని దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తెలుగు వైబ్స్ అనే సోషల్ మీడియా కేసీఆర్‌ , హరీశ్‌ రావు గొడవ పడ్డారని పోస్ట్ చేశారని.. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా ఛానెల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసమర్థతను కప్పి పుచ్చుకోనేందుకు ప్రజల్లో బీర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇక ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ట్విట్టర్‌లో కేసీఆర్‌, హరీశ్‌రావుపై అసభ్యకరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిక వెనుక కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా హస్తం ఉందని ఆరోపించారు. ఎవరైతే తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని , బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, చిన్న చిన్న కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేస్తుందని అన్నారు. తమ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఏసీ రూమ్‌ల నుంచి బయటకు రావాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఖండించారు. దీనిపై అధికారులు స్పందించాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోరారు.

Exit mobile version