Site icon Swatantra Tv

ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్… పొంచి ఉన్న ‘కేమెల్ ఫ్లూ’ ముప్పు

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సాకర్ మెగా ఈవెంట్ చూసేందుకు ఖతార్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఖతార్ లో ‘కేమెల్ ఫ్లూ’ వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ‘కేమెల్ ఫ్లూ’ వైరస్ ను మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) అని కూడా పిలుస్తారు.

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ డిసెంబరు 18వ తేదీ వరకు జరగనుంది. ఈ పోటీల కోసం 12 లక్షల మంది ఖతార్ రావొచ్చని అంచనా. దాంతో వైరస్ వ్యాపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఖతార్ లో ప్రతి రోజు 300 వరకు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెర్స్ వైరస్ కూడా వెలుగు చూస్తే అదుపు చేయడం కష్టమని ఖతార్ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మెర్స్ ను తక్కువగా అంచనా వేయరాదని, మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా హెచ్చరిస్తోంది. మెర్స్ వైరస్ ప్రధానంగా రోగగ్రస్తమైన ఒంటెల నుంచి మానవులకు సోకుతుంది. మెర్స్ వైరస్ ఎక్కువగా మధ్య ప్రాచ్య దేశాల్లోనూ, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఉనికి చాటుకుంటోంది. 2012 నుంచి ఇప్పటిదాకా 27 దేశాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది.

ఈ వైరస్ సోకితే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, దగ్గు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధుల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో, డయాబెటిస్ బాధితుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

Exit mobile version