స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ఉపసంహరణకు దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరగడమే కారణమని RBI తెలిపింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా డిజిటల్, యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని.. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా దాదాపు 87.92 బిలియన్ లావాదేవాలు జరిగాయని పేర్కొంది. కేవలం 2022 సంవత్సరంలోనే వాటి విలువ రూ.14.92లక్షల కోట్లు ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా 10.8 శాతం మాత్రమే రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఏడాది మార్చి నెల వరకు దేశంలో చలామణిలో ఉన్న నగదు రూ.31.33 లక్షల కోట్లు. ఇందులో రూ.2,000 నోట్ల వాటా రూ.3.62 లక్షల కోట్లగా ఉందని వెల్లడించింది. ఇందులోనూ ఎక్కువమొత్తం బ్యాంకుల్లోనే ఉందని.. లేదా అవినీతిపరుల వద్ద ఉండొచ్చని తెలిపింది. సామాన్యుల దగ్గర మాత్రం రూ.2000నోట్లు చాలా తక్కువగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
గత రెండేళ్లుగా రూ.2000 నోట్ల చలామణి దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి బ్యాంకులకు వెళ్లిన ఈ నోట్లు తిరిగి వాడుకలోకి రాలేదు. ఏటీఎంలలోనూ ఈ నోట్ల జారీని బ్యాంకులు నిలిపివేశాయి. దీంతో ప్రజల దగ్గర రూ.500, రూ.200, రూ.100 నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల రూ.2000నోట్లు ఉపసంహరణ నిర్ణయం సామాన్యులపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.