Site icon Swatantra Tv

నేడు నల్లగొండలో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ నల్లగొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. క్లాక్‌టవర్‌ వేదికగా మోగనున్న జంగ్‌సైరన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRతోపాటు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు పూర్తి చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహాధర్నాను నిర్వహించనున్నారు.

ఈ ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణమాఫీ, చేసిన రుణమాఫీ, ఇంకా చేయాల్సిన రుణామాఫీతోపాటు రైతుభరోసా కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ పూర్తి చేయకపోవడం, రైతుభరోసాను మూడు సీజన్లుగా పెండింగ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ…. జనవరి 12న నల్లగొండ క్లాక్‌ టవర్‌ వేదికగా సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ఇబ్బందులు ఉంటాయన్న పోలీసుల సూచన మేరకు వాయిదా వేసి 21న నిర్వహించతలపెట్టింది. అయితే, ధర్నాకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీనిని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.

Exit mobile version