ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేపట్టిన దీక్ష ప్రశాంతంగా ముగిసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill) కోసం కవిత తలపెట్టిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 18 పార్టీల నేతలు మద్దతు పలికారు. సాయంత్రం 4గంటలకు కవితకు ఎంపీ కే.కేశవరావు(MP Keshava Rao) నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షతో మొదలైన తన పోరాటం.. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసయ్యేవరకు కొనసాగుతుందని కవిత వెల్లడించారు. దీక్షకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. దీక్ష ముగియడంతో ఇక కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈడీ కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లై, మనీశ్ సిసోడియాతో కలిపి కవితను అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత కవితను అరెస్టును చేస్తారా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి.