Site icon Swatantra Tv

పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమథనం 15శాతం వృద్ధి రేటే లక్ష్యం – చంద్రబాబు

APలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి అవసరమైన విధానాలు, ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌- 2047పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు. సమావేశంలో టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ సహా పలువురు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం మేధోమథనం చేశారు. విజన్‌-2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలకు సంబంధించి తన అభిప్రాయాలను చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. దాన్ని పేద వర్గాలకు పంచి ప్రజల జీవనప్రమాణాలను పెంచొచ్చని స్పష్టం చేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించామని.. ప్రస్తుతం 15 శాతం సాధిస్తామన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

ఇప్పుడు సాంకేతికత మరింతగా అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయని… కొత్త ఆవిష్కరణలకు తాము వేదికగా ఉంటామని స్పష్టం చేశారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేశామని.. నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, మానవవనరులు అందుబాటులో ఉన్నాయన్న ముఖ్యమంత్రి… వాటికి తోడు అత్యుత్తమ పాలసీలను ప్రకటించామని స్పష్టం చేశారు.

Exit mobile version