Site icon Swatantra Tv

ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ

     అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మ్యాజిక్ చేసేసింది. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో.. బీజేపీ ఇప్పటికే 10 స్థానాలను కైవసం చేసుకుంది. ఓటింగ్ జరగలేదు, కౌంటింగ్ లేనే లేదు.. అయినా బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికలతోపాటు.. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ తొలివిడత అంటే ఏప్రిల్ 19న ఎన్నికలు జరగను న్నాయి. ఇప్పటికే అక్కడ నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువు పూర్తి అయ్యింది. 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మినహా.. ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో.. ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ సహా.. డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ తదితరులున్నారు. ముక్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫెమా ఖండూపై ఎవరూ పోటీకి దిగలేదు. అలాగే సాగలి అసెంబ్లీ స్థానానికి టెక్కీ రోటు మాత్రమే నామి నేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖండూ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోడీకి ప్రజలపై ఉన్న ప్రేమ వల్లే ఇదంతా జరిగిందని వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఫెమా ఖండూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు అసెంబ్లీలోని 60 కి 60 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version