Site icon Swatantra Tv

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ టార్గెట్

    ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో 370 గెలుస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ అందుకు తగ్గ ప్లాన్లను సిద్దం చేసుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 303 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు గత ఎన్నికల కన్నా మరో 67 సీట్లు ఎక్కువగా గెల్చుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకోసం బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఏపీలో పొత్తులతో, తెలంగాణలో నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ టార్గెట్ రీచ్ కావాలని ప్రణాళికలు వేస్తోంది.

    పార్లమెంట్‌ ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలనే టార్గెట్‌ పెట్టుకున్న బీజేపీ… దక్షిణాదిపై ఫోకస్‌ పెంచింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలలో మొత్తం 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్ని కలలో 29 స్థానాలు గెలిచింది. కర్నాటకలోని 28 స్థానాలకుగాను 25 స్థానాలు, తెలంగాణ లో నాలుగు స్థానాలను బీజేపీ గెలిచింది. తమిళనాడు, కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కర్నాటకలో మాత్రమే ఆ పార్టీ కొంత బలంగా ఉన్నది. అయితే అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గతంలో బీజేపీ గెలిచిన 25 స్థానాలు మళ్ళీ గెలవడం అసాధ్యమని ఆ పార్టీకి అర్దమయిపోయింది. ఎప్పటిలాగే కేరళ, తమిళనాడులో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే మిగిలిన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మీద ఆ పార్టీ కేంధ్రీకరించి పనిచేస్తున్నది.

    తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడంలో భాగ‍ంగానే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనతో జతకడుతున్న బీజేపీ, తెలంగాణలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఏపీలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన కళ్యాణ్ తో ఢిల్లీ అమిత్ షా ఒక దఫా చర్చలు కూడా అయిపోయాయి. బహిరంగా ప్రకటించకపోయినప్పటికీ ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయం జరిగిపోయినట్టు సమాచారం. ఇక తెలంగాణలో బీజేపీకి చురుకైన క్యాడర్ ఉన్నప్పటికీ సరైన నాయకులు లేకపోవడం ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశం అందువల్ల ఆ పార్టీ ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిస్పృహలో ఉన్న బీఆరెస్ పార్టీ నాయకులపై బీజేపీ కన్నువేసింది. బీఆరెస్ కు చెందిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఆయన కుమారుడు భరత్ లు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లు బీఆరెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి నాగర్ కర్నూల్ నుంచి భరత్, జహీరాబాద్ నుంచి పాటిల్ లు పార్లమెంటుకు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరే కాక బీఆరెస్ నాయకుడు మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. రేపో మాపో ఆయన కూడా బీజేపీ లో చేరబోతున్నారు. మరో వైపు వరంగల్ జిల్లా బీఆరెస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ కూడా బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉంది.

       పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో పోటీ చేయడం కోసం బీజేపీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని సంప్రదించినట్టు తెలు స్తోంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉండటమే కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా చేశారు. పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందారు. బిజెపి ప్రతిపాదనను ఆమోదించడానికి ప్రొఫెసర్ చక్రపాణి మొదట విముఖత వ్యక్తం చేసినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం అభ్యర్థనను జాతీయ నాయకత్వానికి పంపింది. కేంద్ర నాయకత్వం త్వరలో ప్రొఫెసర్ చక్రపాణితో చర్చలు జరుపుతుందని భావిస్తున్నారు. వీళ్ళే కాకుండా బీఆరెస్‌కు చెందిన మరో నలుగురు ముఖ్యనేతలతో బీజేపీ చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. వారు కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందే బీజేపీలో చేరే అవకాశం ఉంది.

    పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే అధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటోంది బీజేపీ. ఒంటరిగా 370 స్థానాలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిపి 400 కుపైగా స్థానాలు గెలుచు కుంటామని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లోనూ గతంకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మొదలు పెట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి.

Exit mobile version