Site icon Swatantra Tv

దక్షిణాది రాష్ట్రాలపై పట్టుకు బీజేపీ డేగ కన్ను

   యావత్ దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటకలోనే. అందుకే కర్ణాటకను గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు కమలనాథులు. 1989 నుంచి బీజేపీకి కర్ణాటక బలమైన కోటగా ఉంది. పార్టీకి యడ్యూరప్ప లాంటి మాస్ లీడర్ ఉండటం అలాగే లింగాయత్ సామాజికవర్గం మద్దతు ఉండటంతో కన్నడ నాట కమలం పార్టీ సంస్థాగతంగా బలోపేతమైంది.

      కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈసారి 25 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కిందటేడాది మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయింది. అయినప్పటికీ కన్నడనాట బీజేపీకి గట్టి పట్టుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ ఉంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ 25కు తగ్గేదేలేదంటోంది . ఇదిలా ఉంటే మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్ధన్‌ రెడ్డి తాజాగా బీజేపీలో చేరారు. బెంగళూరు లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్‌ నేత యడ్యూరప్ప సమక్షంలో ఆయన బీజేపీకండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అరుణ లక్ష్మీ కూడా బీజేపీ గూటికి చేరారు. గాలి జనార్దన్ రెడ్డి తమ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి రాక, బీజేపీకి ప్లస్ పాయింటేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో మొద‌టి నుంచి ద్రవిడ పార్టీల‌దే హ‌వా. అంతేకాదు దేశంలోనే తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే అధికారంలోకి వ‌చ్చింది త‌మిళనాడులోనే. రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌కు తమిళనాట ఉనికే లేదు. తమిళనాట ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు తెచ్చుకోవ‌డం త‌ప్ప జాతీయ పార్టీలకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల స‌త్తా చాటిన నేల త‌మిళ‌నాడు. 1999లో అప్పటి మిత్రపక్షం డీఎంకేతో కలిసి ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక ఆ తరువాత మిత్రుల ఎంపికలో జరిగిన పొరపాట్లు, తమిళనాట నాయకత్వ లోపాల కారణంగా బీజేపీ దెబ్బతిన్నది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ బలపడిందనే చెప్పుకోవచ్చు.

తమిళనాడులో నిన్నమొన్నటివరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదికాదు. ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ కాలం గడిపేసింది కమలం పార్టీ. అయితే తమిళనాట బీజేపీకి ఊపిరులూదిన నాయకుడు అన్నామలై అనే చెప్పాలి. అన్నామలై పూర్వాశ్రమంలో ఐపీఎస్ అధికారి. కర్ణాటక క్యాడర్‌లో పనిచేశాడు. సమర్థుడైన పోలీసు అధికారిగా జనంలో గుడ్‌విల్ తెచ్చుకున్నాడు. తమిళనాట బీజేపీకి దిక్కుమొక్కులేని రోజుల్లో 2021 జులైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయపార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకెళ్లాడు అన్నామలై.

లోక్‌సభ ఎన్నికలకు స్థానికంగా ఉన్న కొన్ని పార్టీలతో బీజేపీ ఈపాటికే పొత్తు పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ.తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నారు. కేరళలో మౌలికంగా వామపక్ష భావజాలం ఎక్కువ. సైద్దాంతికంగా బీజేపీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలు కేరళలో దాదాపు 50 శాతం ఉంటారు. దీంతో బీజేపీ అనుకున్నస్థాయిలో కేరళలో బలోపేతం కాలేకపోయింది. వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న కేర‌ళ ప్రజలు హిందూత్వ అజెండాతో వ‌చ్చిన బీజేపీ ని స‌హ‌జంగానే దూరం పెట్టారు. వామపక్షాలను కేరళీయులు కాదనుకుంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండనే ఉంది. మరో విషయం, కేరళలో బీజేపీకి మిత్రపక్షం అంటూ ఒక్కటీ లేదు. కేరళలో బీజేపీ ఎదగకపోవడానికి ఇదో కారణం. అయితే ఇటీవలి ఎన్నికల్లో కేరళలో బీజేపీ 15శాతం ఓట్లకు చేరగలిగింది. అలాగే క్రిస్టియన్లలోని కొన్ని వర్గాలను కూడా కమలం పార్టీ ఆకట్టుకుంటోంది. కేరళలో బీజేపీకి మిత్రపక్షం అంటూ ఏదీ లేదు. దీంతో ఒంటరిగానే బలోపేతం అయ్యేందుకు శ్రమిస్తోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో కేరళలో సెలబ్రిటీలను, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎన్నికల బరిలో దించుతోంది కమలం పార్టీ.

ఇదిలా ఉంటే కేరళలోని వయనాడ్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయం సాధించారు.ఈసారి కూడా రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో వయనాడ్ నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కే. సురేంద్రన్‌కు టికెట్ ఇచ్చారు. వాస్తవానికి వయనాడ్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 2009 నుంచి వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. వాస్తవానికి 2004లో కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోయాక, పదేళ్లపాటు దక్షిణాదిపై దృష్టి పెట్టలేదు. అయితే 2014లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక దక్షిణాదిపై దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో దక్షిణాదిన గెలుపు కోసం సెలబ్రిటీ లను బరిలోకి దింపుతోంది కమలం పార్టీ.

Exit mobile version