Site icon Swatantra Tv

ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త

మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్ లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరోవైపు ఆన్ లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో Amazon, Flipkart, Myntra, Jio Mart కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్ లైన్ అలా కుదరదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్‌కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి.

కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Exit mobile version