ఒంగోలులో వెలిసిన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోస్టర్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలినేనికి ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే దామరచర్ల ఆహ్వానం పలకడమే ఇందుకు కారణం. బాలినేనికి,. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరిపై మరొకరు నిత్యం ఏదో ఒక అంశంపై ఫైర్ అవుతూనే ఉండేవారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 4వ తేదీన జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.
బాలినేనిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటుగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా భారీగా ప్రయత్నాలు చేశారు. కానీ అవి సఫలం కాలేదు. ఇప్పుడు బాలినేనికి స్వాగతం పలుకుతూ జనార్ధన్ ఫోటోలతో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజలను ఓకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల కలిసి పని చేయబోతున్నారా అనే చర్చ మొదలైంది.
వైసిపి ఆధీనంలో ఉన్న ఒంగోలు కార్పొరేషన్ ను హస్తగతం చేసుకునేందుకు ఓవైపు బాలినేని.. మరోవైపు దామచర్ల ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే హఠాత్తుగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం ప్రజలను ఆశ్చర్యంతో పాటుగా ఆలోచించే విధంగా ఉన్నాయి. నిన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపై పదేపదే మాట్లాడిన దామచర్ల జనార్ధన్… బాలినేనితో కలిసి పని చేస్తారా….. లేక ఆయన అవినీతిపై ఎప్పటిలాగే పోరాటం చేస్తారా అని స్థానికంగా చర్చ జరుగుతోంది.