Site icon Swatantra Tv

మొబైల్ ఫోన్లలో ‘అవతార్-2’ పైరసీ

అవతార్ 2 సినిమా విడుదలకు ముందే పైరసీ బయటకు వచ్చేయడంతో బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న సినిమా మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షం కావడంతో అది కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే…

‘అవతార్’ ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూసిన సినిమా…తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన సినిమా. కొన్ని వేల కోట్లు వసూలు చేసి ప్రపంచ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా. 2009లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమాకి సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత అవతార్-2 విడుదల కావడంతో సినిమా అభిమానులు, ప్రజలు ఒక్కసారిగా ఉత్కంఠకు గురయ్యారు.

దురదృష్టం ఏమిటంటే…సినిమా రిలీజ్ కి ముందే పైరసీ విడుదలైపోవడం జనమంతా దానిని డౌన్ లోడ్ చేసుకుని చూసేయడం జరిగిపోయింది. దాంతో అది సినిమా వసూళ్ల పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వందలకోట్ల ఖర్చుతో తీసిన అవతార్-2ను తీర్చిదిద్దడానికి డైరక్టర్ జేమ్స్ కెమరాన్ కి దాదాపు పదేళ్లపైనే పట్టింది. అన్ని కోట్లుఖర్చు పెట్టి, అంతకాలం వెచ్చించి…, అహర్నిశలు శ్రమించి, తన జీవితకాలపు కలను సాకారం చేసేలా తీసిన అత్యద్భుత సెల్యూలాయిడ్ దృశ్యకావ్యం లాంటి సినిమాని జనం అతి తేలిగ్గా చూసేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 52వేల థియేటర్లలో, భారతదేశంలో ఇంగ్లీషుతో సహా 7 భాషలలో సినిమా విడుదలవుతోంది. ఒకరోజు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో సినిమాని అత్యధిక రేట్లకు కొన్న బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా టికెట్టు ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. మనకు తెలిసిన ఒక  ప్రముఖ మెట్రో నగరంలోని త్రీడీ, ఫోర్ డీ స్క్రీన్లపై అవతార్ సినిమా ఏకంగా రూ.1450 ఉందని అంటున్నారు, ఇక పుణెలో రూ.1000 ఉంటే, ఢిల్లీలో రూ.1200, కోల్ కతాలో రూ.750, అహ్మదాబాద్ లో రూ.800, ఇండోర్ రూ.700 గా టికెట్ ధరను విక్రయిస్తున్నట్టు సమాచారం.

సినిమాపై ఇంత భారీ అంచనాలు ఉండగా ఒక్కసారి పైరసీ విడుదల కావడంతో బయ్యర్లు, థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లు, ప్రజల ఆదరణను బట్టి తర్వాత సిరీస్ ని ప్లాన్ చేస్తానని దర్శక నిర్మాత జేమ్స్ కెమరాన్ ఇప్పటికే ప్రకటించాడు. ఇలాంటి అరుదైన సినిమాలు మళ్లీ రావాలంటే ప్రజల్లోనే మార్పు రావాలని సినీ అభిమానులు వ్యాక్యానిస్తున్నారు.

సినిమాలో అనుభూతిని పొందాలంటే కచ్చితంగా థియేటర్ లోనే అవతార్ 2 చూడాలని పలువురు వ్యాక్యానిస్తున్నారు.

Exit mobile version