Site icon Swatantra Tv

పాదయాత్ర చేస్తున్న టీడీపీ అభిమానిపై దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్‌

Nara Lokesh Padayatra
స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నారా భువనేశ్వరికి సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన కార్యకర్త చింతల నారాయణపై దాడి జరిగింది. నంద్యాల నుంచి రాజమండ్రికి వస్తున్న ఆయనపై పల్నాడు జిల్లా విఠంరాజుపల్లి వద్ద కొందరు దుండగులు దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న టీడీపీ జెండాలను లాక్కొని పడేశారు. ఈ దాడిలో గాయపడ్డ నారాయణను స్థానిక టీడీపీ నేతలు ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాడిపై నారాయణ స్పందిస్తూ… రోజు మాదిరిగానే ఈ ఉదయం తాను పాదయాత్రను ప్రారంభించానని… రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు తనను వెంబడించారని… వినుకొండ దాటిన తర్వాత తనపై దాడి చేశారని చెప్పారు.

మరోవైపు ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఇది అమానవీయ ఘటన అని అన్నారు. సీఎం జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకు కూడా అంటుకుందని విమర్శించారు. జగన్ తన శాడిజంను చూపిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్న జగన్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రజలను కూడా హింసిస్తున్నారని దుయ్యబట్టారు. వృద్ధుడు అని కూడా చూడకుండా దాడి చేశారంటే… దాడికి పాల్పడింది ముమ్మాటికీ వైసీపీ సైకోలే అని అన్నారు. జగన్ చూసిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

Exit mobile version