Site icon Swatantra Tv

బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా ‘కళింగ’దే హవా

కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రగ్యానయన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా ఇప్పుడొస్తున్న సినిమాల్లో చాలా వరకు మొదటి వారం థియేటర్‌లో అలరించడమే గగనంగా మారుతోంది. అయితే సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కళింగ’ సినిమా రెండో వారం కూడా విజయవంతంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. వర్డ్‌ ఆఫ్ మౌత్‌తో ఈ సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది.

ఈ చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారని ఇటీవల నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో, దర్శకుడు ధృవ వాయు సంతోషం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పారు. ఈ నెల 13న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.22 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో వెల్లడించింది.

Exit mobile version