వైసీపీ సీనియర్ నేత విజయ్ సాయిరెడ్డి పై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారా..? ఆయనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తల వెనుక ఆ పార్టీ నేతలే ఉన్నారా..? సాయిరెడ్డిని పార్టీ నుంచి పక్కన పెట్టేందుకే ఇలాంటి కుట్రలు తెరపైకి తీసుకొస్తున్నారా..? ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వయంగా విజయ్ సాయిరెడ్డే. తన పై సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సాయిరెడ్డిని టార్గెట్ చేసిన ఆ నేతలు ఎవరు..? ఆయన పై ఎందుకు కుట్రలు చేస్తున్నారు..? ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకునే నాయకుల్లో విజయ్ సాయిరెడ్డి కూడా ఒకరు. కొద్దికాలం వరకు పార్టీలో ఆయనే నెంబర్ టుగా కొనసాగారు. అయితే కొంత కాలంగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, ఢిల్లీ వ్యవహారాలు మొదలు వైసీపీ రాష్ట్ర వ్యవహారాల వరకు చక్క పెట్టడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి కూడా చాలానే ఉంది. 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయనే నెంబర్ టుగా కొనసాగుతూ వచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత సాయిరెడ్డికి మొదట్లో పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలతో పాటు, ఉత్తరాంధ్ర బాధ్యతలు, అలాగే ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత ఉత్తరాంధ్ర బాధ్యతలకు పరిమితం చేశారు. అక్కడ విజయ సాయిరెడ్డి తీరుపై విమర్శలు రావడంతో ఆయన్ని కేవలం ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం చేశారు. అంతే కాకుండా సీఎమ్‌వోలో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన వర్గం చెబుతోంది. ఎన్నికల ముందు కొన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు అప్పగించినా అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో కేవలం నెల్లూరు పార్లమెంట్‌కే పరిమితం అయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీతో పాటు సాయిరెడ్డి సైతం ఓటమి చెందారు. దీంతో అసలే పార్టీలో అంతంత మాత్రంగా ఉన్న ఆయన పలుకుబడికి మరింత ప్రాధానత్య తగ్గుతూ వచ్చింది.
ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ అధినేత జగన్ పార్లమెంటరీ పార్టీతో పాటు లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలను ప్రకటించారు. గతంలో విజయసాయి రెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండే వారు. అయితే 2024 ఎన్నికల తరువాత ఆ పదవిని మరో రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డికి అప్పగించారు. సాయిరెడ్డిని కేవలం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా మాత్రమే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి చుట్టూ ఓ వివాదం కొనసాగుతోంది. ఆయన ప్రతిష్టకి భంగం కలిగేలా కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ వివాదం వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారని ఎంపీ సాయిరెడ్డి భావిస్తున్నారు. తనపై కుట్రలు చేస్తున్న వారిలో సొంత పార్టీ నేతలు ఉన్నారని స్వయంగా ఆయనే చెప్పారు. దీంతో సాయిరెడ్డికి వ్యతిరేకంగా పని చేస్తున్న నేతలు ఎవరు అనేది పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఎంపీ సాయిరెడ్డిపై ఆరోపణల వెనుక ఒక మాజీ ఎంపీతో పాటు తాడేపల్లి కేంద్రంగా పార్టీ, ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరించిన వారి ప్రమేయం ఉన్నదని చర్చ వైసీపీలో జోరుగా జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ ఒకరితో సాయిరెడ్డికి విభేదాలు ఉన్నాయి. సాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ఆ ఎంపీతో పాటు కొందరు నేతలకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. గతంలో ఇదే విషయంపై అప్పటి సీఎం జగన్ స్వయంగా విశాఖకు చెందిన కొందరు నేతలను పిలిచి మందలించారు. అలాగే గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీగా ఉన్న సమయంలోనే ఆ నేత సాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకొని బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే అది ఎన్నికల సమయం కావడంతో అప్పట్లో పార్టీ అధినేత జగన్ సాయిరెడ్డిని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత ఆ మాజీ ఎంపీ సాయిరెడ్డిని టార్గెట్ చేశారని.. అందులో భాగంగానే ఆయనపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని వైసీపీలోని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే తాడేపల్లిలోని ఒక ముఖ్య నేత కూడా అందుకు సహకారం అందించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమితో జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు సొంత పార్టీ నేతల్లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ వివాదాలు కాస్త అధిష్టానానికి తలనొప్పిగా మారాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.