Site icon Swatantra Tv

ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి – పవన్

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇక ఆయన పుట్టిన రోజును మెగా అభిమానులంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల సహా సామాన్యులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరుకు ఆయన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని పవన్ పేర్కొన్నారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసని పవన్ పేర్కొన్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయన్నారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని… అభ్యర్ధిస్తారని పేర్కొన్నారు. ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నునిగా చేసిందేమోనని పవన్ పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించారని పవన్ పేర్కొన్నారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్నని పవన్ వెల్లడించారు. తల్లి లాంటి తన వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చిరు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని చిరు కుటుంబం దర్శించుకుంది. చిరంజీవిని దగ్గరుండి స్వామి వారి దర్శనానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తీసుకెళ్లారు.

Exit mobile version