Site icon Swatantra Tv

తిరుమలలో మరో ప్రమాదం

తిరుమలలో మరో ప్రమాదం జరిగింది. లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో 47వ లడ్డూ కౌంటర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది వాటిని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

తిరుమలలో చిన్న ప్రమాదం జరిగినా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. మూడు రోజుల కిందట తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. ఆ భయం ఇంకా భక్తుల్ని వెంటాడుతోంది. తాజాగా లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

మొదట ప్రమాదం జరిగిన లడ్డూ 47వ కౌంటర్‌ నుంచి పొగ వచ్చింది. ఏం జరిగిందో అర్ధం కాక కాసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కౌంటర్‌లో కంప్యూటర్‌ యూపీఎస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయి. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఫైరింజన్లకు సమాచారమిచ్చారు. ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

దీంతో భారీ ప్రమాదం తప్పిందని టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుని తరించాలని ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో టీటీడీ సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యారు. మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version