Site icon Swatantra Tv

ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాత అవస్తలు

ఆదిలాబాద్‌ జిల్లాలో అన్నదాత అవస్తలు పడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి, రోజులకొద్దీ క్యూలైన్‌లో పడిగాపులు కాసినా విత్తనాలు దొరకని పరిస్థితితో అల్లాడుతున్నారు. దీంతో కడుపుమండి కన్నెర్ర చేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వ తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రైతన్న రోడెక్కే దుస్థితి ఎందుకొచ్చింది..?, విత్తనాల కొరతకు కారణాలేంటి..? ప్రభుత్వ వైఫల్యమా, డీలర్‌ మాయాజాలమా..?

దేశానికి అన్నం పెట్టే అన్నదాత అవస్తలు పడుతున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకావడంతో విత్తనాలపై దృష్టి సారించిన రైతన్నకు సీడ్‌ కొరత కంటతడి పెట్టిస్తోంది. మండుటెండలో రోజుల కొద్దీ పడిగాపులు కాసినా విత్తనాలు దొరకని పరిస్థితితో ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తన విక్రయాల్లో డీలర్ల మాయాజాలంతో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. కొన్ని విత్తనాలకు కృత్రిమ డిమాండ్ సృష్టించడంతో అన్నదాతలు వాటి కోసమే బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. అందకపోవడంతో రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రత్తిసాగు ఎక్కువ. అయితే,.. సాగుకు తగ్గ సీడ్‌ సకాలంలో అందక పత్తిరైతులు కష్టాలు పడుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లోనే అన్ని సీడ్స్‌ తెప్పించాల్సిన వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యానికితోడు.. డీలర్లు ఇష్టారాజ్యాన బ్లాక్‌లో అమ్ముకోవడంతో తాము అవస్థలు పడాల్సి వస్తోందని ఫైర్‌ అవుతున్నారు రైతన్నలు. కంపెనీ ప్రతినిధులతో ములాకత్ అయిన కొంతమంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని.. డిమాండ్ లేని విత్తనాలకు సైతం ప్రముఖ కంపెనీ విత్తనాల పేరిట కృత్రిమ డిమాండ్ సృష్టించి రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపోతే విత్తనాల ప్రాముఖ్యతను వివరించాల్సిన వ్యవసాయ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని అధికారులపై కూడా గుర్రుగా ఉన్నారు. తమకు కావలసిన రాశి 659 పత్తి విత్తనాలను తెప్పించడంలో ఫెయిల్‌ అయ్యారని.. దీంతో విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, ఆందోళనలకు దిగే దుస్థితి వచ్చిందని అగ్గి మీద గుగ్గిలంలా నిప్పులు చెరుగుతున్నారు.

ఇక అధిక దిగుబడి కారణంగా రైతులు రాశి 659 విత్తనాన్నే కోరుకుంటున్నారు. తెగుళ్లను తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉండటంతో ఫర్టిలైజర్స్‌ ఖర్చు కూడా తగ్గుతుందటున్నారు. పైగా ఆదిలాబాద్‌ జిల్లాలో నల్లరేగడి నేలకు ఇది అనుకూలమని అందుకే ఈ సీడ్‌నే ఎంచుకుంటామని చెబుతున్నారు. పంట కాలంకావడంతో మూడు రోజులుగా ఎర్నని ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడ్డామని.. మహిళలు చిన్న పిల్లలను పట్టుకుని పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని నిప్పులు చెరుగుతున్నారు. పోలీసులు నిలబడి క్యూలైన్‌లను నియంత్రించే వరకూ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో,.. విత్తనాల కొరతతో ఎన్ని అవస్థలు పడుతున్నామో అర్థం చేసుకోవాలంటున్నారు.

ఇక స్వయంగా జిల్లా కలెక్టర్‌ రంగంలోకి దిగి డీలర్ షాపులలో స్టాకు వివరాలు రిజిస్టర్ లను పరిశీలించడం వరకు చేరుకుంది. మరోవైపు విత్తనాల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పదేళ్ల పాలనలో రైతులు ఇలాంటి కష్టాలు చూడలేదని.. కాంగ్రెస్‌ పాలనతోనే మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆరోపిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. కమలనాథులు కూడా తమదైన స్టైల్‌లో రేవంత్‌ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. మరి రైతులు ఆరోపిస్తున్నట్టు విత్తనాల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమా..? డీలర్లను నియంత్రించడంలో అధికారులు నిజంగానే ఫేయిల్‌ అయ్యారా..? అందుకే రైతుకు అందాల్సిన సీడ్‌ బ్లాక్‌లో దొరుకుతుందా అంటే అవుననే అంటున్నారు అన్నదాతలు. మరి ఇకనైనా కట్టడి చర్యలకు పూనుకుంటారా..? లేదంటే చోద్యం చూస్తారో చూడాలి మరి.

Exit mobile version