Site icon Swatantra Tv

ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న కల్తీ కల్లు

అసలే ఎండాకాలం. పొద్దంతా కూలి పని చేసి అలసట తెలియకుండా కునుకుతీయాలంటే కడుపులో కల్లు చుక్క పడాల్సిందే… దుకాణం గడప తొక్కాల్సిందే. ఇదే అదునుగా ప్రజలు ఏమైపోతే మాకేంటి..? వారి బలహీనతను సొమ్ము చేసుకున్నామా..? జేబులు నింపుకున్నామా అన్నట్టుంది కామారెడ్డిలో కల్తీ కల్లు కథ

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏరులై పారుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక కేసులెన్ని పెట్టినా దేనికి జంకకుండా విచ్చలవిడిగా కల్తీ వ్యాపారంతో జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు. మరోపక్క కల్లుకు బానిసైన జనం అది ఆరోగ్యానికి మంచిదా.. ప్రాణాలను పాడు చేస్తుందా అన్నది ఆలోచించకుండా సీసా ఎత్తేస్తున్నారు. మత్తులో మునిగిపోతున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలతో వాళ్లేకాదు.. ఇంటిల్లిపాది లబోదిబోమంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని బాన్సువాడ, బీర్కుర్, గాంధారి, సదాశివ నగర్, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, రాజంపేట్ మండల కేంద్రంతోపాటు ఆ పరిధిలోని పలు గ్రామాలలో అక్రమ కల్తీ కల్లు దందా విచ్చలవిడిగా సాగుతోంది. అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో మూడు పువ్వులు… ఆరు కాయలు అన్నట్టు సాగుతోంది అక్రమ దందా. ఈ కల్తీకల్లుతో జనం అనారోగ్యం బారిన పడటమే కాదు.. తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ తమ ప్రాణాల మీదకే కాకుండా పక్కనోడి ప్రాణాల మీదకు తెస్తున్నారు.

హానికమైన రసాయనాలు వాడుతూ తమ దందా కోసం కల్లును కల్తీ చేస్తున్నారు. అల్ఫోజాలం, యూరియా, శెక్రిన్, ఇతర కెమికల్ మందులు కలిపిన కల్లు వల్ల ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒకవేళ రెండు మూడు రోజులు కల్లుకు దూరంగా ఉన్నా ఫిట్స్ వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నారు. కొందరైతే మెంటల్ స్టేజ్‌లోకి వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ పిచ్చిలో కుటుంబాన్ని వదిలి ఎటు వెళ్తున్నారో తెలియని దుస్థితి. మరికొందరైతే ఏకంగా మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్నారు. ఇక వేసవి తాపంతో జనం కల్లీకల్లును మరింత తాగేస్తున్నారు. దీంతో విక్రయాలు జోరందుకుని వారి పంట పండు తోంది. ఇదిచాలదన్నట్టు చిన్న పిల్లలను ఈ కల్తీ దందాలోకి లాగుతున్నారు. బాల కార్మిక చట్టానికి తూట్లు పొడుస్తూ చిన్న పిల్లలతో డిపోల్లో పనులు చేయిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కల్తీభూతాన్ని వదిలించాలని అక్రమ దందాపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు కామారెడ్డి జిల్లా వాసులు.

Exit mobile version