Site icon Swatantra Tv

2009 నుంచి అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోంది- జైశంకర్

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులతో అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.. ఈ నేపథ్యంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని యూఎస్ అధికారి షేర్ చేశారు. అక్రమవలసదారుల్ని విజయవంతంగా భారత్‌కు తరలించామని పోస్టుపెట్టారు.

అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపేశామని.. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తోన్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడి చేస్తోందని తన పోస్టులో తెలిపారు. అక్రమంగా సరిహద్దులు దాటితే.. పంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు. ఆ వీడియోలో సీ-17 విమానం డోర్ తెరిచి ఉంది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లడం కనిపించింది. నేరస్థులను తీసుకెళ్లినట్టుగా వారిని విమానంలోకి తరలించారు. వెనక సైనికులు ఎక్కారు.

ఇదిలా ఉంటే.. విపక్షాల విమర్శలపై ఇప్పటికే కేంద్రం స్పందించింది. అమెరికా నుంచి భారత్‌ వచ్చిన విమానంలో వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతికి సంకెళ్లు ఉన్న దృశ్యాలు నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని, ఓ భారతీయుడిగా ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులను సంకేళ్లు వేసి పంపడం అమెరికా ఫెడరల్ పాలసీ అని చెప్పుకొచ్చారు. వలసదారులకు ఆహారం, మెడిసిన్ అందించారని అన్నారు. టాయిలెట్‌ బ్రేక్‌లో బేడీలో తీశారని తెలిపారు. 2009 నుంచి అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోందని చెప్పారు. అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమి కాదని చెప్పుకొచ్చారు మంత్రి జైశంకర్. 2009 నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందన్న ఆయన.. 2009 లో 734, 2010 లో 799 ఉండగా… 2025లో 104 మంది వలసదారులను తరలించారని అన్నారు.

Exit mobile version