Site icon Swatantra Tv

తొలిదశ పోలింగ్ లో కాషాయం వెలవెల !

  2024 లోక్ సభ ఎన్నికలు తొలిదశలో 102 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. మొదటి విడత పోలింగ్ ట్రెండ్ పరిశీలిస్తే, కాషాయం వెలవెలబోయినట్లే స్పష్టమౌతోంది. ఫస్ట్ షో లో బీజేపీ పెర్ఫార్మెన్స్ పై మిశ్రమ స్పందన కన్పిస్తోంది. మోదీ మ్యాజిక్ కనుమరు గైంది. మోదీ నినాదం”ఇస్ బార్ 400 పార్” వట్టి నినాదమే అన్పిస్తోంది. బీజేపీకి అంత సీన్ లేదని, తొలివిడత ఓటింగ్ సరళితో తేలిపోయింది. కనీసం మోదీ.. కోరుకుంటున్న 370 ప్లస్. నైనా అందుకుంటారా.! అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుం టున్నారు.

  ఈ సారి లోక్ సభ ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూనే ప్రధాని నరేంద్రమోదీ. “ఇస్ బార్ 400 పార్” అని నినదించారు. “తీస్రీ బార్.. మోదీ సర్కార్” అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోరస్ పాడారు. ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా దాదాపు అన్నిరాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, వరాల వర్షం కురిపిస్తూ, బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించారు. 2014, 2019 కన్నా అత్యధికంగా లోక్ సభ సీట్లు సాధించేందుకు పార్టీ శ్రేణులను, పదాధికారులను కూడా పరుగులు పెట్టించారు. బీజేపీ తప్ప భారతదేశంలో మరే పార్టీ విజయం అంచులకు చేరబోదని ప్రచారం హోరెత్తించారు. గత ఐదు దశాబ్దాలుగా లోక్ సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, 1984లోక్ సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 414 స్థానాలను గెలుచుకుంది. స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం సానుభూతి పవనాల కారణంగానే కాంగ్రెస్ కు ఈ విజయం దక్కింది. ఆ తర్వాత ఏ పార్టీ 400 మార్క్ దాటలేదు. 2014లో మోదీ ప్రభంజనం లో కూడా బీజేపీ 400 మార్క్ దాటలేదు. 2014లో ఎన్డీఏ కూటమి 336 సీట్లు సాధిస్తే.. బీజేపీ 282 సీట్లను కైవసం చేసుకుంది. 2019లో ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెలుచుకుంటే.. బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్డీఏ 400 పైగా సాధించాలన్న లక్ష్యంతో కాషాయదళం ఎన్నికల గోదాలో దిగింది.

  ఈసారి పార్లమెంటు ఎన్నికలు తొలిదశలో 102 నియోజకవర్గాలు ఉండగా బీజేపీ 77 సీట్లలో పోటీ చేసింది. తమిళనాడు లో గతంలో అన్నాడిఎంకె తో పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే నెగ్గిన బీజేపీ ఈసారి డిఎంకె, ఏఐఏడిఎంకె కూటములకు పోటీగా తన ఆధ్వర్యంలో మూడో కూటమిని పోటీకి దించింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ 23 సీట్లలో పోటీ చేసింది. 2019లో తొలిదశలో 102 స్థానాలకు బీజేపీ 60 సీట్లలోనే పోటీ చేసింది. తమిళనాడులో సాంప్రదాయకంగా డిఎంకె, అన్నాడి ఎంకె వంటి ద్రవిడ పార్టీలదే హవా. గతంలో బీజేపీ పెద్దగా రాణించకపోయినా, మోదీ చరిష్మాను నమ్ముకుని 23 స్థానాల్లో పోటీ చేసింది. త్రిముఖ పోటీలో డిఎంకె, అన్నాడిఎంకె కూటములను ఢీ కొట్టింది. గతంలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవని కమలదళం త్రిముఖపోటీలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 1,2 సీట్లు గెలవడం అనుమానమే.

  తొలిదశలో బీహార్ లో నాలుగు స్థానాలకు,ఉత్తరప్రదేశ్ లో 8 స్థానాలకు, పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాలకు, రాజస్థాన్ లో 12 స్థానాలకు ఉత్తరాఖండ్ లో 5 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడి పోలింగ్ సరళిను పరిశీలిస్తే.. బీజేపీ సునామీనే ఎదుర్కొన్నట్లు కన్పిస్తోంది. బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి, యూపీలో అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలో కూటమి. బెంగాల్ లో మమతా బెనర్జీ టీఎంసీల హవా నడిచిందని, బీజేపీ వెలవెల బోయిందని వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉన్నట్లు సూచనలు వస్తున్నాయి. దీంతో మోదీ అండ్ కో 400 పార్. కాదు కదా! కనీసం 370 వైపు అడుగులు వేస్తుందా! అన్నది అనుమానమే. కాంగ్రెస్ విషయానికి వస్తే, తొలిదశలో 102 స్థానాల్లో 65 స్థానాలకే పోటీ చేసింది. తమిళనాడులో డిఎంకె ఆధ్వర్యంలో బలమైన కూటమిలో భాగ స్వామిగా 9 స్థానాల్లో పోటీ చేసింది. 2019లో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో 8 స్థానాలను గెలుచుకుంది. అదే ఎన్నికల్లో డిఎంకె 19 స్థానాలు గెలుచుకుంది. 2019 లో కాంగ్రెస్ మొత్తం మీద 52 స్థానాలు నెగ్గితే,యూపీఏ స్కోర్ 98 దాటలేదు. తొలిదశలోని 102 స్థానాల్లో బీజేపీ పోటీచేసిన 77లో కచ్చితంగా గెలిచే స్థానాలు 25ను మించ బోవని ఎన్నికల పరిశీల కులు భావిస్తున్నారు. అదీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి చోట్లే. తొలిదశ ఓటింగ్ ట్రెండ్ ను  బట్టి బీజేపీ విజయావకాశాలను పూర్తిగా అంచనా వేయలేం. మొత్తం ఏడు దశల పోలింగ్ కావల్సిందే. ఏది ఏమైనా.. తొలిదశ పోలింగ్ ట్రెండ్ ను బట్టి బీజేపీ. “400 పార్” అన్నది అసాధ్యం అని తేలిపోయింది. బీజేపీకి ఫస్ట్ ఫేజ్ లో ” జోర్ సె ధక్కా. ధీరేసే లగా.!”

Exit mobile version