Site icon Swatantra Tv

ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ భయపెడుతోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నది చలికాలం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. గాలిలో తేమ పెరిగిన కొద్దీ కాలుష్యం తీవ్రత అధికమవుతోంది. చాలా ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 పాయింట్లను దాటిపోయింది.

ఇండియాగేట్‌, భజన్‌పురా, ఆనంద్‌ విహార్‌, అశోక్‌ విహార్‌, ఆయా నగర్‌, అలీపూర్‌, చాందినీ చౌక్, నెహ్రూనగర్‌, పంజాబీ బాగ్‌, సోనియా విహార్‌.. ఇలా ఏ చోట చూసినా ఉదయం పది గంటలకు సైతం దాదాపుగా చీకటి వాతావరణమే కన్పిస్తోంది. ఎక్కడ చూసినా మబ్బుల మాదిరిగా కన్పిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు డిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. జీఆర్‌ఏపీ నియమాలు సైతం స్థానికులకు ఉపశమనం కల్పించలేకపోతున్నాయి. GRAP రూల్స్‌ ప్రకారం అత్యవసరం కాని నిర్మాణ పనులు, కూల్చివేతలు, పెట్రోల్‌తో నడిచే పెట్రోల్‌తో నడిచే BS3 వాహనాలు, డీజిల్‌తో నడిచే BS4 బండ్లు, డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలులోకి వచ్చింది. అయినా ఇప్పటివరకు పెద్దగా ప్రభావం కన్పించలేదంటున్నారు హస్తిన ప్రజలు.

ఢిల్లీ పొరుగునే ఉన్న పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాల దగ్ధం వంటి ఘటనలు అధికం కావడమూ కాలుష్యానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసిన ఫోటోలు సైతం ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

రాజధానిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐదవ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు ఢిల్లీ సీఎం ఆతిశీ. పరిస్థితులు చక్కబడే వరకు ఇవే ఆదేశాలు కొనసాగుతాయని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు హస్తిన ముఖ్యమంత్రి. సాధారణంగా గాలి నాణ్యత జీరో నుంచి 50 మధ్య ఉంటే చాలా బాగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికర స్థాయిలో ఉందని అర్థం. ఇక, 300 దాటిందంటే తక్కువ నాణ్యత అని భావించాల్సి ఉంటుంది.

Exit mobile version