Site icon Swatantra Tv

ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలి – న్యాయవాది విక్రమ్‌ చౌదరి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరగతుండగానే అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరఫున న్యాయవాది ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్‌ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఇవాళ్టికి వాయిదా వేశారు. నిన్న కవిత పిటిషన్‌ దాఖలు చేయగా, గత పిటిషన్‌తో కలిపి రెండింటినీ ఇవాళే సుప్రీం ధర్మాసనం విచారించనుంది.

Exit mobile version