Site icon Swatantra Tv

పెర్సాపెన్ సంబరాల్లో ఆదివాసీలు

   ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు ఆదిలాబాద్‌ జిల్లా. వారి జీవన విధానాలను, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావి తరాలకు వారసత్వంగా అందజే స్తున్న ఆదివాసీలు. పెర్సాపెన్‌ వేడుకలో మునిగిపోయారు. వైశాఖ మాసంలో ఐదు రోజులపాటు ఈ ఉత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహిస్తారు. మరి ఈ పండుగ ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటో ఓసారి చూసే ద్దామా.

  అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌ జిల్లాలో వేలాది ఆదివాసి గిరిజన కుటుంబాలు ఉండటంతో.. ఈ జిల్లాకు ఆదివాసి ఖిల్లాగా పేరొచ్చింది. వీరు జరుపుకునే పండుగలు కాస్త వింతగా ఉన్నా ఎంతో విశిష్టత ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తూ చేసే పండుగల్లో పూజా కార్యమాలు ప్రత్యేకం. అలాగే ఆటపాటలకు పెద్ద పీట వేస్తూ పండుగలో మరింత ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా వీరి సాంప్రదాయ పండుగల్లో ఒకటి పెర్సపెన్‌ ఉత్సవం. ఆదివాసి గిరిజనులు తమ పెద్ద దేవుడిగా కొలిచే ఈ పెర్సపేన్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో భక్తి శ్రద్ధలతో ఐదు రోజుల పాటు పండుగ జరుపుకుంటారు. మండుటెండల్లో ఉపవాసం ఉంటూ తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసి గిరిజనుల్లోని నాలుగు, ఐదు, ఆరు, ఏడు సంఘాలకు చెందిన గిరిజనులు ఇప్పచెట్టుపై ఉంచిన పెర్సపేన్‌ను కిందకు దించి గ్రామాల్లోకి తీసుకురావడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

   ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల నడుమ మెస్రం వంశస్థుల అల్లుళ్లు పవిత్ర జలంతో దైవ స్నానం చేయించిన అనంతరం. ఇప్పచెట్టుపై వారు ఆ దేవుడిని ఉంచడంతో పెర్సపేన్ పూజలు ముగుస్తాయి. ఇక ఈ వేడుకల్లో భాగంగా జరుపుకునే భేటింగ్‌ పూజ మరింత ప్రత్యేకం. తమ ఇంటి కొత్త కోడళ్ళను కుటుంబ పెద్దలు తమ దైవాలకు పరిచయం చేసే కార్యాన్నే భేటింగ్ అని పిలుస్తారు. ఇలా భేటింగ్ జరిగితే ఆ ఇంటి కొత్త కోడళ్ళు ఇతర దేవతలను చూడగలుగుతా రని, ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారమని, అందుకే తప్పకుండా పాటిస్తామని చెబుతున్నారు గిరిజనులు. ఇలా ఆదిలాబాద్‌ ఆదివా సీలు ఏం పండుగ జరుపుకున్నా అది ప్రకృతిని ఆరాధించేదిగా, వారి పెద్దలను గౌరవించేదిగా, ఆచార వ్యవహారాలు, సంసృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసేదిగా ఉంటాయి. అందుకే ఆ ప్రాంతంలో జరిగే నాగోబా పండుగకు దేశమే కాదు. యావత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Exit mobile version