Site icon Swatantra Tv

ప్రొద్దుటూరు టీడీపీలో మూడు ముక్కలాట

    ఏపీ సీఎం జగన్ సొంతజిల్లాలో ప్రతినియోజకవర్గంలోనూ ఘనవిజయం సాధించి వైసీపీని దెబ్బతీయాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిడిపి అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించనుందో నని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజులు రెడ్డి, సిఎం సురేష్ నాయుడు, జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట సాగుతోంది.

     తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి , టీడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో టిడిపి ఉనికి కాపాడుతున్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్  రెడ్డికేనని గతంలో చెప్పినా… జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయోమయంలో ఉన్నారు.

      టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితా లో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థాని కంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో ముగ్గురు కీలక నేతలు అధినేత ప్రకటనకోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు బీజేపీలో ఉన్నా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఏడు నెలల నుంచి ప్రొద్దు టూరు లోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3 వేల మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టిడిపిలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు. టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో టిడిపిని గెలిపించాలంటూ తన సాయి శక్తుల కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేశ్ నాయుడు.

     ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తు న్నారు. తనకు కానీ, తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ఇవ్వాలని పలు మార్లు అధిష్టానానికి విన్నవిం చుకున్నట్లు తెలిసింది. ఐదుటర్మ్ లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొందిన నంద్యాల వరదరాజుల రెడ్డి కి అర్థబలం తక్కువైనా అంగబలానికి కొరతలేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని , ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు.

    లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టిడిపి టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న నాయకుడిని ఎంపిక చేయడంతోపాటు, రానున్న రోజులలో టికెట్ దక్కక అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. 

Exit mobile version